హైదరాబాద్ ని అతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి నగరంలో ఎక్స్ ప్రెస్ హైవేలు, ఎలివేటడ్ హైవేలు, హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు వగైర నిర్మిస్తామని తెరాస ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. వాటిలో బహుళ అంతస్తుల భవనాల ఊసు ఇప్పుడు ఎత్తడం లేదు కానీ హైవేల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మునిసిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్. శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా జవాబు చెప్పారు. వాటి కోసం సుమారు రూ. 83,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కె.టి.ఆర్. చెప్పారు. ఈ పనుల కోసం ఇప్పటికే 19 సంస్థలతో చర్చించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు ఈ.పి.సి., బి.ఓ.టి., డి.బి.ఎఫ్.ఓ.టి. వంటి విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాటిలో ప్రభుత్వానికి, సదరు నిర్మాణ సంస్థలకి ఏది ఆమోదయోగ్యంగా ఉంటే దానిని అమలుచేయాలనుకొంటున్నట్లు మంత్రి చెప్పారు. ఆ సంస్థలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇంకా అందజేయలేదని, అవి తమ చేతికి రాగానే అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరికీ వాటి వివరాలను తెలియజేస్తామని మంత్రి కె.టి.ఆర్. చెప్పారు. రూ.19,222 కోట్లు వ్యయం అయ్యే ఈ పనులలో కొన్నిటిని నాలుగు దశలలో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగేనాటికే హైదరాబాద్ అన్ని విధాల చాలా అభివృద్ధి చెంది ఉందని అద్నరికీ తెలుసు. తెరాస ప్రభుత్వం చేపట్టబోయే ఈ అభివృద్ధి పనులు కూడా పూర్తయినట్లయితే నాలుగు ప్రధాన మెట్రో నగరాలతో సమానంగా నిలుస్తుంది. అయితే దీని కోసం నిధుల సమీకరణ చేయడమే పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.1.25 కోట్లు అవసరమని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేయలేకనే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ అది కూడా చాలా కష్టంగానే ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధికి కూడా దాదాపు అదే స్థాయిలో భారీగా నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది. తెరాస ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించగలిగినట్లయితే ఇంక హైదరాబాద్ నగరానికి తిరుగుఉండదు.