హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సస్పెండైన న్యాయమూర్తి రామకృష్ణతో ఆరోపణలు చేయించడానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య కుట్ర చేసినట్లుగా ఆరోపణలకు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. రామకృష్ణ హైకోర్టుకు సమర్పించిన ఆడియో టేప్… మీడియా ప్రసారం చేసిన ఆడియో టేప్ లో ఉన్నది తన వాయిసేనని.. తాను రామకృష్ణతో మాట్లాడినది నిజమేనని ఈశ్వరయ్య ఒప్పుకున్నారు. అయితే.. అది ప్రైవేటు సంభాషణగా చెప్పుకున్నారు. ఫోన్లలో ఎక్కడైనా జరిగేది ప్రైవేటు సంభాషణే కానీ.. పబ్లిక్ సంభాషణ ఉండదు. తన ఆడియో టేపును అడ్డదిడ్డంగా ఎడిటింగ్ చేశారని.. తనను అల్లరి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఈశ్వరయ్య చెప్పుకొచ్చారు.
రామకృష్ణకు హెల్ప్ చేద్దామని ప్రయత్నించానని… జస్టిస్ ఈశ్వరయ్య చెబుతున్నారు. నిజానికి మాజీ జడ్జి రామకృష్ణ ఇటీవలి కాలంలో నాగార్జున రెడ్డి ఇష్యూతో.. పెద్దిరెడ్డి ఇష్యూతో బయటకు వచ్చారు. ఎనిమిదేళ్లుగా ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయనకు హెల్ప్ చేద్దామని ఇప్పటి వరకూ ఆయన పట్టించుకోలేదు. కానీ.. హఠాత్తుగా ఈశ్వరయ్య ఆయనను ఉపయోగించుకుని న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆయనను కన్సల్ట్ చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఆడియో టేపులో న్యాయవ్యవస్థపైనా.. న్యాయమూర్తులపైనా అత్యంత దారుణమైన భాషను వాడిన వైనంపై మాట్లాడేందుకు ఈశ్వరయ్య నిరాకరించారు. ప్రస్తుతం విషయం కోర్టులో ఉన్నందున మాట్లాడబోనంటూ కవర్ చేసుకున్నారు.
న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత.. కుల సంఘం పెట్టుకున్న ఈశ్వరయ్య… ఆ సంఘం పేరుతో కొద్ది రోజుల కిందట… ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పై ఆరోపణలు చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాయించారు. ఇప్పుడు.. తన ఆడియో టేప్ బయటకు రావడం.. సంచలనం సృష్టించడంతో.. తాను మొత్తం బీసీలకు ప్రతినిధినన్నట్లుగా.. తానపై ఆరోపణలు చేస్తే.. బీసీలందరిపై చేసినట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కొన్ని బీసీ సంఘాలను.. వైసీపీ తరపున ఆయనకు మద్దతుగా ప్రెస్మీట్లు పెట్టమని ప్రోత్సహించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం.. ఆయన తానే ఆడియో టేపుల్లో మాట్లాడానని.. .అంగీకరించడంతో… హైకోర్టు విచారణ కీలకం కానుంది. దీనిపై విచారణకు ఆదేశిస్తే.. ఈశ్వరయ్య వెనుక ఎవరున్నారో బయటపడుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.