లాంఛనం పూర్తి. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించేశారు. దీనితో వైసీపి నుంచి టీడీపీలోకి ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్య 23కి చేరింది. సోమవారం టీడీపీలోకి ఆమెని చంద్రబాబు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు గంపగుత్త గా టీడీపీలో చేరారు. జంప్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ పాడిన పాటే గుడ్డి ఈశ్వరి కూడా పాడారు. అభివృద్ధి ని చూసే టీడీపీలో చేరుతున్నట్టు చెప్పారు. తాను గిరిజనుల పక్షపాతి ని అన్నారు. గిరిజనుల అభివృద్ధి బాబు తోనే సాద్యం అన్నారు.
ఈ సందర్భంగా తనకు రాజీకీయ భిక్ష పెట్టిన పార్టీని వదలాల్సి వచ్చిన పరిస్థితులను ఆమె మననం చేసుకున్నారు. తాను ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వైసీపీని బలోపేతం చేశానని చెప్పారు. అయినప్పటికీ పార్టీలో తనకు గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభా రవిబాబును తిరిగి తీసుకొచ్చి పార్టీలో కేవలం డబ్బున్నవారికే టిక్కెట్లు అంటూ చెప్పడంతో తాను తట్టుకోలేకపోయానన్నారు. తాను రూ.25 కోట్లకు అమ్ముడుపోయాననే వైసీపీ శ్రేణుల విమర్శలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన దగ్గర పైసా లేదన్నారు. అంత డబ్బు ఆశ ఉంటే తానిలా ఉండేదాన్ని కాదన్నారు. తానెప్పుడూ చంద్రబాబును పరిధి మించి విమర్శించింది లేదన్న ఆమె, ఏదేమైనా తెలుగుధేశం పార్టీ నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.