బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్ , హరీష్ రావుల ఇటీవలి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితకు బెయిల్ కోసమే ఈ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళారని, అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ ను ఎలా ఎదుర్కోవాలనేది ఈ హస్తిన టూర్ ఎజెండా అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఇద్దరి నేతల ఢిల్లీ పర్యటన వివరాలు అధికారికంగా ఎవరూ ప్రకటించకపోవడంతో ఈ ప్రచారం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.
కవిత బెయిల్ కోసం న్యాయవాదులతో ఓ వైపు సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు హరీష్ రావు బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్ళారని ప్రచారం వైరల్ గా మారింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ గూటికి చేరాలని భావిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో కానీ, ఈ ప్రచారం మాత్రం అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.
మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను ఈ నెలఖారులో నియమిస్తారని లీకులు ఇస్తోంది అధిష్టానం. బీఆర్ఎస్ నేతలతో ఈటలకున్న పరిచయాలతో ఆ పార్టీలోనున్న నేతలను బీజేపీలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయనకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇసున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పై గురి పెట్టిన బీజేపీ.. అందుకు ఈటల తోడైతే ఈ టాస్క్ ను ఈజీగా కంప్లీట్ చేస్తారనే ఆలోచనతో ఉందని అంటున్నారు.
అందులో భాగంగానే హరీష్ రావును సైతం లాగేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన ఈటల బీజేపీలో హరీష్ చేరికపై స్పందించారు. బీజేపీలో చేరే విషయంపై హరీష్ ఆలోచన చేస్తుండవచ్చని, ఈ మేరకు అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని.. అయితే ఈ విషయంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేమీ కామెంట్ చేయలేనని ఈటల అన్నారు. దీంతో… ఈ విషయంపై కొంత క్లారిటీ వచ్చినట్లే అని అంటున్నారు పరిశీలకులు.