తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక పార్టీలో కొత్త పంచాయితీకి తెరతీస్తోంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తూ రేసులో ఉండటంతో ప్రధాన నాయకుల మధ్య అగ్గి రాజేస్తోంది. ప్రెసిడెంట్ పోస్ట్ ను ఆశిస్తోన్న నేతలు తగ్గేదేలే అంటూ వ్యాఖ్యలు చేస్తుండటం పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి… సెంట్రల్ లో రెండోసారి మంత్రి అయ్యారు. బీజేపీలో ఉన్న నియమం ప్రకారం ఒకరికి ఒకే పదవి ఉండాలి. దీంతో కిషన్ రెడ్డి ప్లేసులో మరో అధ్యక్షుడు రావటం ఖాయమైపోయింది. అయితే, కేంద్ర క్యాబినెట్ ఏర్పాటు సమయంలో మంత్రి పదవి ఆశావాహుల్లో ఉన్న ఈటలకు ప్రెసిడెంట్ పోస్టు ఇస్తామని అధిష్టానం కబురు పంపిందన్న ప్రచారం జరిగింది. మరోవైపు కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఆశించిన మహిళా నేత డీకే అరుణ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఫైర్ బ్రాండ్ గా ఉన్న రఘునందన్ రావు, సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పదవి ఆశిస్తుండటంతో… అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీకి కొత్త నీరు, శక్తి అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించటంతో ఈటల తన మనసులో మాట బయటపెట్టారు. వెంటనే నేనెక్కడ వెనకబడి పోతానేమో అన్నట్లుగా రాజాసింగ్.. దేశం కోసం, ధర్మం కోసం , పార్టీపై భక్తి ఉన్న వారికి మాత్రమే పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ కామెంట్ చేయటంతో పార్టీలో అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి.
పార్టీని అంటిపెట్టుకొని పని చేస్తోన్న నేతలకే పార్టీ అద్యక్ష పదవి ఇవ్వాలని,కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు పార్టీ పగ్గాలు ఇవ్వొద్దనేది రాజాసింగ్ వర్షన్. తాజాగా రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈటలను ఉద్దేశించి చేసినవనేది ఓపెన్ సీక్రెట్. పైగా రఘునందన్, డీకే అరుణ కూడా రేసులో ఉండటంతో… అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.