బీజేపీలో ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చారు. ఆయన విచ్చలవిడిగా నేతల్ని బీజేపీలోకి తీసుకొస్తారని అనుకుకున్నారు. ఈటల కూడా అదే అనుకున్నారు. పార్టీలో నేతల్ని చేర్పించి… తాను బిగ్ లీడర్ అయిపోవాలనుకున్నారు. అయితే అనేక ప్రయత్నాలు చేసినా… బీజేపీలో చేరుతున్న వారే లేరు. దీంతో కేసీఆర్ కోవర్టుల వల్లే బీజేపీలో చేరికలు లేవని ఆయన ఫీలవుతున్నారు.
ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నిర్వేదాన్ని తెలియచేస్తున్నాయని కొందరు అంటూంటే… తెలంగాణలో కేసీఆర్కు ఎదురు లేదని అన్ని పార్టీలు ఆయన గ్రిప్లోనే ఉన్నాయని దీంతో తేలిపోతుందని మరికొందరు అంటున్నారు.
కేసీఆర్కు చెక్ పెట్టాలని బీజేపీ ప్లాన్స్ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీల్లోనూ కోవర్టుల భయం ఉంది. బీజేపీలో ఇప్పటి వరకూ నిబద్దులైన నేతలు ఉంటారని అనుకుంటారు. కానీ ఈటల వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆ పార్టీలోనూ భయం …ఆందోళన కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే.. ఇప్పుడు కేసీఆర్ ను చూసి అన్నిపార్టీల నేతలూ ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీలోనే ఒకరిని ఒకరు నమ్మలేని పరిస్థితికి చేరుతున్నారు.