ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అవడం.. తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఎందుకంటే కొండావిశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. రాజకీయ చౌరస్తాలో ఉన్నారు. ఏం చేయాలన్నదానిపై ఆయన మేథోమథనం జరుపుతున్నారు. ఆయన నోటి వెంట కూడా కొత్త పార్టీ మాట ఇది వరకు వచ్చింది. ఈటల రాజేందర్ కూడా కొత్త పార్టీ ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ తరుణంలో వారిద్దరూ కొత్త పార్టీ గురించే ఆలోచన చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. బయటకు మాత్రం ఈటల రాజేందర్ భార్య జమున.. తమ బంధువని.. పలకరించి పోదామని వచ్చానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. అయితే.. రాజకీయం జరగలేదని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు.
ఈటల, కొండా మాత్రమే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో మరికొంత ముఖ్యులు.. ఉద్యమంలో పేరు పడ్డ వారితో కలిసి .. సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారని చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అది ఇప్పుడు మెటీరియలైజ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యమ తెలంగాణలో … ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారంతా ఇప్పుడు… వెనుకబడిపోయారని.. బీటీ బ్యాచ్ పేరుతో టీఆర్ఎస్లో చేరిన వారు పదవులు అనుభవిస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే ఉద్ధృతంగాఉంది. తెలంగాణ ఫలాలు ఉద్యమకారులు అందాలని.. తెలంగాణప్రజలు పొందాలని.. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వారు కాదనే నినాదంతో… ఆత్మ గౌరవం అనే కాన్సెప్ట్‌తో అందరూ ఒక్క సారిగా ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్లో ఇప్పుడు.. ఓ రకమైన గంభీర వాతావరణం ఉంది. హైకమాండ్ విమర్శించమన్నది కాబట్టే కొంత మంది ఈటలపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. చాలా మంది… మనసు లోతుల్లో నుంచి అవి రావడం లేదు. కొప్పుల ఈశ్వర్‌కు.. తెలంగాణ ఏర్పడిన తొలి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఆయన అప్పట్లో ఎంత అసంతృప్తికి గురయ్యారో టీఆర్ఎస్లో అందరికీ తెలుసు. రాజయ్య లాంటి బీటీ బ్యాచ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఈశ్వర్‌ను పక్కన పెట్టడంపై ఆయన రగిలిపోయారు. అదే సమయంలో.. ముందస్తు ఎన్నికల్లో ఈశ్వర్‌ను ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి. అతి కొద్ది ఓట్ల తేడాతో ఆయన బయట పడ్డారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఆయనకు అసంతృప్తి ఉంది.
ఈటలకు ప్రజల్లో సానుభూతి వచ్చిందనేది… టీఆర్ఎస్ హైకమాండ్‌కూ అర్థమైంది. ఇప్పటి వరకూ ఈటలపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడం ఓ కారణం అయితే… ఇతర నేతలపై పెద్ద పెద్ద కబ్జా ఆరోపణలు వచ్చినా స్పందించని సీఎం.. ఈటలపై మాత్రం… విరుచుకుపడుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. అదే … కొత్త పార్టీకి పునాదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. ఈటల.. కొండా మాత్రమే కాదు.. తెలంగాణలో ఇతర ఉద్యమ కారులంతా ఏకమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.