తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలి కాలంలో టీఆర్ఎస్లో అలజడి రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఓ సారి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని ముఖ్యమంత్రి కేసీయార్ సొంత మీడియాలో ప్రచారం జరిగినప్పుడు తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత కరోనా హడావుడిలో కాస్త తగ్గారు. కానీ ఇప్పుడు మళ్లీ… తెలంగాణలో అధికార మార్పిడి హడావుడి జరుగుతండటంతో కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా… తన సొంత నియోజవకర్గంలో ” పార్టీలు ఉండక పోవచ్చు, జెండాలూ ఉండకపోవచ్చు.. ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటానని ” ప్రకటన చేశారు. దీంతో ఆ సమావేశంలో ఉన్న వారందరూ ఉలిక్కి పడ్డారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు లేకుండా చూసుకున్నాం కానీ ఇంకేమీ సాధించలేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఈటల స్టైల్ వేరుగా ఉంది. ” ఇవాళ కేసీఆర్ ఉన్నా లేకపోయినా.. నేను మంత్రిగా ఉన్నా లేకపోయినా రైతులకు అండగా ఉంటా”నని ప్రకటించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను మొదటగా వ్యతిరేకించిన కేసీఆర్ తరవాత రూటు మార్చారు. ఇప్పుడు పంట కొనుగోలు కేంద్రాలు కూడా ఎత్తేసి.. ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోమని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో రైతు సమస్యల కేంద్రం ఈటల భావోద్వేగంగా స్పందించిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి.
తెలంగాణలో త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందని చెబుతున్నారు. కేటీఆర్ కేబినెట్లో ఈటకు చోటు ఉండదన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే.. ఈటలకు రీష్ రావు వర్గీయుడనే ముద్ర ఉంది. దాన్ని ఆయన చెరుపుకోలేకపోయారు. నాయకత్వ మార్పు అంటూ జరిగితే హరీష్ రావు విషయంలో ప్రత్యేకజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈటలనూ దూరం పెడతారన్న చర్చ నడుస్తోంది. దీని గురించి స్పష్టత ఉండటంతోనే ఈటల..ఇలా రోజు వివాదాస్పదంగా స్పందిస్తున్నారని అంచనా వేస్తున్నారు. అదే ప్రసంగంలో.. ” రాజేందర్ అనే నేను ఉం మీ గౌరవాన్ని పెంచే దిశగా అడు గులు వేస్తాను..” అంటూ ప్రకటించడంతో… ముందు ముందు ఈటల నుంచి షాకింగ్ న్యూస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.