ఈటల రాజేందర్‌ను రాజకీయంగా బలహీనం చేయాలనుకున్న ప్రయత్నాల్లో కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తున్నట్లుగా కనిపించడం లేదు. నిన్నామొన్నటి వరకూ.. సైలెంట్‌గా ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు ఈటల వెంటనే ఉంటామని చెబుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు ఎవరూ టీఆర్ఎస్ను వీడకుండా.. ఈటల వెంట నడవకుండా చేసే బాధ్యతల్ని .. మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. ఆయన అదే మిషన్ మీద ఉన్నారు. ప్రతీ రోజూ…హుజూరాబాద్ నియోజకవర్గ నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
నియోజకవర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈటల వైపు వెళ్లకుండా మాట్లాడుతున్నారు. తాయిలాలు ఆశ చూపుతున్నారు. వినని వారిపై బెదిరింపులకూ వెనుకాడటం లేదు. చాలా మందికి వివిధ రకాల నోటీసులు వెళ్లాయి. ఈ వేధింపుపై ఈటల నేరుగానే మండిపడ్డారు. తోడేళ్లలాగా దాడి చేస్తున్నారని కూడా అన్నారు. గంగుల ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా… చాలా మందిని ఈటల వైపు వెళ్లకుండా ఆపలేకపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన చెందిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈటలను కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. టీఆర్ఎస్ వెంటే ఉంటామని చెబుతున్నవారుకూడా ఇప్పుడు ఈటల వెంట ఉంటామని చెబుతున్నారు.
ఇటీవల జమ్మికుంట మునిసిపాలిటీ చైర్మన్, వైస్‌చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు టీఆర్ఎస్ వెంటే ఉంటామన్నారు. వారం రోజుల్లో పరిస్థితి మారిపోయింది. అధికారులను బదిలీ చేసి, ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నాని..అయినా సరే తాము ఈటల వెంటే ఉంటామన్నారు. గంగుల సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారని.. ఈటల .. ఇరవై ఏళ్లుగా నియోజకవర్గంలో పాతుకుపోయినందున.. అందర్నీ ఆయనకు దూరం చేయాలంటే బెదిరింపుల మార్గం పని చేయదన్న అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. హుజూరాబాద్‌లో ఈటలనే పైచేయి సాధించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.