తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికార పార్టీకి దూరం కాబోతున్నారనీ, పార్టీ మారబోతున్నారంటూ ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఆయన… మేం పార్టీకి ఓనర్లం, అడుక్కునేవాళ్లం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం, పార్టీ మారడం లేదని చెప్పడంతోపాటు, తన శాఖ పనుల్లో నిమగ్నమైపోయారు ఈటెల. అయితే, ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని ప్రస్థావించి మళ్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకి వివరిస్తున్న సందర్భంలో పార్టీ మారతానంటూ తనపై వస్తున్న కథనాల మీద మరోసారి మంత్రి స్పందించారు.
తాను పార్టీ మారతానంటూ వస్తున్నవన్నీ గాలి వార్తలు అని ఈటెల కొట్టిపారేశారు. తన గురించి అనేవాళ్లు ఎన్నైనా అనుకుంటూ ఉంటారనీ, వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతా అని మరోసారి చెప్పారు. నిజానికి, ఇప్పుడీ అంశం ప్రముఖంగా చర్చల్లో లేదు. ఈటెల పార్టీ మారబోతున్నారట అనే కథనాలు కూడా ఈ మధ్య లేవు. అదంతా ముగిసిన అధ్యాయం. కానీ, ఇప్పుడేదో భారీ ఎత్తున ప్రచారం జరిగిపోతున్నట్టుగా ఈటెల స్పందించడం విచిత్రంగా ఉంది! ఇంకోటి.. మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ నిధులకు సంబంధించి ఈటెల చేసిన వ్యాఖ్య కూడా దాదాపు అలానే ఉంది. నిధులు లేకపోయినా మిగతా శాఖల్ని ఎలాగోలా నడిపించొచ్చు అనీ, కానీ ఆరోగ్య శాఖకు అలా కుదరదన్నారు. కేటాయించిన నిధులు కచ్చితంగా విడుదల కావల్సిందే అన్నారు. వానొచ్చినా వరదలొచ్చినా ఆరోగ్య శాఖకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే అన్నారు.
నిధుల కోసం ఈటెల ఎవరిని డిమాండ్ చేస్తున్నట్టు..? సొంత ప్రభుత్వాన్నే కదా. ఇదెలా ఉందంటే… ఆరోగ్య శాఖకు నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదని చెప్పడమే ఉద్దేశంగా ఉంది. పన్లో పనిగా ఇతర శాఖలను నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే అంశాన్ని పరోక్షంగా ఆయన వెల్లడించినట్టయింది. సొంత ప్రభుత్వ అసమర్థనను బయటపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి ఇప్పటికీ ఆయనలో ఎక్కడో ఉందా అనే అనుమానమే కలుగుతోంది.