రాజకీయాల్లో అంతే…! అప్పటి వరకూ సహచరుడు… ఆయనపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని తేలిన వెంటనే.. ఆయనకు వ్యతిరేకంగా ఇతరులు ఎగబడి విమర్శలు చేయడం కామన్. ఎందుకంటే.. ఆయనను ఎంత తిడితే.. హైకమాండ్ దృష్టిలో అంత మంచివారు. ఇప్పుడు టీఆర్ఎస్లో అదే జరుగుతోంది. ఈటలను సీనియర్లందరూ చెడామడా తిట్టేస్తున్నారు. ఎందుకంటే… హైకమాండ్ గుడ్ లుక్స్‌లో పడేందుకు. కరిగిపోయిన ఎమ్మెల్సీ పదవిని మళ్లీ రెన్యూవల్ చేయించేందుకు సీనియర్లు.. ఈ పాట్లు పడుతున్నారు. ఈటలను చెడామడా విమర్శించేస్తున్నారు.
కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవి అయిపోయింది. ఖాళీగా ఉన్నారు. ఇటీవల ఎవరిపైనా విమర్శలు చేస్తున్నట్లుగా లేదు.కానీ వారం క్రితం ఒక్క సారిగా సడెన్‌గా తెర ముందుకు వచ్చి.. ఈటలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను వేనోళ్ల పొగిడారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పుడు… మంచి హోదా అనుభవించిన కడియంకు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అనే ప్రచారం కూడా జోరుగా జరిగింది.కానీ ఆయన స్పందించలేదు. ఇప్పుడు రెండో సారి ఎమ్మెల్సీ కూడా డౌట్ అన్న ప్రచారం ఉంది. దీంతో ఈటలను తిట్టడం ద్వారా కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మాజీ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈటెల రాజేందర్ పై విమర్శలు సంధించారు. ప్రస్తుతం సుఖేందర్ రెడ్డి పదవీ కాలం కూడా పూర్తి అయింది. మరోమారు రెన్యువల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి షరతుతోనే ఆయనటీ ఆర్ఎస్లో చేరారు. కానీ అది మాత్రం దక్కడంలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోయింది. ఇస్తారో లేదో తెలియదు. మండలి చైర్మన్ పదవిని పీవీ కుమార్తెకు రిజిస్టర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు గుత్తా కూడా ఈటలను టార్గెట్ చేసుకున్నారు.
ప్రస్తుతం శాసన మండలి లో ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీ అయ్యాయి. అందులో ఐదు స్థానాలు కొత్త వారితో భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో రెండు స్థానాలు మాత్రమే పాత వారికే రెన్యువల్ చేస్తారని అంటున్నారు. ఆ రెండు స్థానాలకు ఇప్పుడు రేస్ జరుగుతోంది.