ఈటల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చీలిక కనిపిస్తోంది. కొందరు నేతలు ఆయనపై సానుభూతి ప్రదర్శిస్తుండగా.. మరికొందరు తమ పార్టీతో సంబంధం లేని నాయకుని పట్ల సానుకూలత అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఈటెల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్లో రేవంత్ వర్గం.. ఆయనకు సపోర్ట్ చేయడం ప్రారంభించింది. రేవంత్ కూడా.. ఈటలతో పాటు దేవరయాంజల్ భూములు కొన్న అందరు టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అదే సమయంలో ఈటల కూడా రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం మాత్రం… ఈటల విషయంలో టీఆర్ఎస్ ఎత్తుగడల్ని సమర్థిస్తున్నట్లుగ ాఉంది. ఉత్తమ్ ఈటలకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ప్రకటనలు చేయలేదు కానీ.. ఆయన వర్గం మాత్రం.. ఈటలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తోంది. ఉత్తమే పీసీసీ చీఫ్గా ఉండాలని పోరాడుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఉత్తమ్ బంధువు అయిన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పాడి కౌశిక్ రెడ్డి ఈటలపై ఎటాక్ చేస్తున్నారు. కరోనా ఉధృతి చల్లబడిన తర్వాత రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఈటల చెబుతున్నారు.
ఈలోగా అన్ని పార్టీల నాయకులను కలిసి వారి మద్దతు కూడా కట్టుకునే పనిలో పడ్డారు. తన రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే విపక్ష పార్టీ లు తన పై పోటీ పెట్టకుండా పావులు కదుపుతున్నారనే టాక్ నడుస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు సహకరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్లో రెండు వర్గాలు ఉండటమే దీనికికారణం. మొత్తానికి ఈటల వ్యవహారం.. ఆ పార్టీలో మరోసారి రెండు గ్రూపు వాదోవవాదాలకు కారణం అయింది.