తెలంగాణ సీనియర్ రాజకీయ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్ కొత్తపార్టీ దిశగా ఆలోచిస్తున్నరన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇటీవల ముగ్గురూ కలిసి ఓ ఫామ్ హౌస్లో రహస్య మంతనాలు జరిపారు. పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నా రని, ఆ క్రమంలోనే ఈటల వారితో రహస్య భేటీ జరిపినట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త నేతల చేరికలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. కొత్త నేతల చేరడం అటుంచితే పార్టీ లో ఉన్న నేతలు కూడా చేజారే ప్రమాదముందన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈటలపై బీజేపీ శ్రేణుల్లోనే అనుమానాలు నెల కొనడంతో పొంగులేటి, జూపల్లితో జరిగిన చర్చల్లో వారిని బీజేపీకి ఆహ్వానించే అంశాన్ని చర్చించారా..? లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో పరోక్షంగా ప్రయోజనం కలిగించే ప్రత్యామ్న్యాయాలపై ఈటల వారితో చర్చించారా..? అని కొంత మంది బీజేపీ రాష్ట్ర నేతలు అనుమానపడుతున్నారు. తమ నిర్ణయాన్ని పొంగులేటి, జూపల్లి ప్రకటించకపోవడంతో వారి రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉమ్మడి శత్రువైన బీఆర్ఎస్ను రానున్న ఎన్నికల్లో ఓడించడానికి బీజేపీ అంత సీరియస్ గా ప్రయత్నించడం లేదన్న అభిప్రాయంలో ఎక్కువ మంది ఉన్నారు.
రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారు కూడా ఇదే అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు అంతా ఏదో ప్లాన్ లో ఉన్నారని తెలంగాణ బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పార్టీ పెడితే ప్రభావం చూపగలమా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయని..ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ను ఓడించేందుకు సీరియస్ గా ప్రయత్నించే పార్టీలో చేరాలని అనుకుంటున్నారు.