బీజేపీ నుంచి మారిపోతారని భావిస్తున్న నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ చేస్తున్న బుజ్జగిపులు ఫలించడం లేదు. గతంలో ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారవద్దని బుజ్జగించిన సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా చేసేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి తన రాజీనామా లేఖ పంపారు. బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యమకారులు భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు. పార్టీలో పనిచేవారిని ప్రోత్సహించడం లేదని ఆరోపించారు.
బీజేపీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్.. గత కొన్నిరోలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రశేఖర్ 1985 నుంచి 2008 వరకు వరుసగా ఐదుసార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆయనకు మరోసారి ఓటమే ఎదురైంది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీని వీడారు.
చంద్రశేఖర్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు.. కాంగ్రెస్‌లో చేరుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లోపు పార్టీ అధ్యక్షుడ్ని మార్చడం.. ఈటలకు కీలక పదవి ఇవ్వడంతో అందరూ ఆగిపోతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని.. మారాలనుకున్న వారంతా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయేందుకు డిసైడయ్యారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.