ఎంపీ ఈటల రాజేందర్ పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఓ వ్యక్తిపై దాడి చేయడం సంచలనంగా మారుతోంది. ఎంపీ అయినంత మాత్రాన ఓ వ్యక్తిపై దాడి చేయడం చట్ట ప్రకారం సమ్మతం కాదు. ఈటల దాడి చేశారని చెప్పి.. తర్వాత ఆయన అనుచరులు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదారు. అతని తప్పు ఉందా లేదా అన్నది కాదు.. ఇలా దాడులు చేయించడం అనేది మంచి పద్దతి కాదు.
మల్కాజిగిరి నియోజకవర్గానికి ఈటల రాజేంద్ర మొదటి సారి ఎంపీ అయ్యారు. దేశంలోని అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి మల్కాజిగిరి. అంతే కాదు మొత్తం హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం, భూముల విషయంలో లెక్కపెట్టలేనన్ని వివాదాలు ఉంటాయి. పేదల పేరుతో కబ్జాలు చేసేవాళ్లు.. నిజంగా దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్నా.. నివాసం ఉంటున్న హక్కుల్లేని పేదలు చాలా మంది ఉంటారు. ఈ భూ వివాదాలపై ఎన్నో కేసులు నమోదవుతూ ఉంటాయి. ఇలా ప్రతి వివాదంలో దాడి చేసుకుంటూ వెళ్తే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు.
సాధారణంగా ఈటల రాజేందర్ చాలా కూల్ గా ఉంటారు. ఎవరిపైనా దాడి చేసిన దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా కీలకంగా ఉన్నా దాడులు చేసేంత దూకుడు ఆయనలో ఉందని ఎప్పుడూ బయటపడలేదు. తొలిసారి ఆయన తన కూల్ నెస్ కోల్పోయారు. ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఇందులో ఏమైనా మతలబు ఉందో.. పేదల కు వచ్చిన కష్టంతో ఆయన అంత ఆవేదనకు గురయ్యారో కానీ.. ఈటల మాత్రం హాట్ టాపిక్ గా మారారు.