హుజూరాబాద్‌లో దాదాపుగా 90 శాతం పోలింగ్ నమోదయ్యే చాన్స్ ఉంది. పూర్తి స్థాయి లెక్కలు ఉదయానికి వెల్లడయ్యే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి 76.26శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లలో ఓటు వేసే వారికి అవకాశం కల్పిస్తారు కాబట్టి రేపు ఉదయానికి మొత్తం ఎంత మేర పోలింగ్ జరిగిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల కారణంగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా సాగింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫలితంగా ఓటర్లు కూడా ఆసక్తి చూపించారు. అందరూ తమ తమ ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఫలితంగా పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది.
పోలింగ్ సరళి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయం పోల్ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. డబ్బులు పంచడం.. ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకు రావడంలో టీఆర్ఎస్ చురుకుగా వ్యవహరించింది. అయితే ఓటు దగ్గరకు వచ్చే సరికి ఎక్కువ మంది పాపం ఈటల అనుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ సరళి విషయంలో టీఆర్ఎస్ నేతలు కూడా అంత ఉత్సాహంగా లేరు. ప్రతి సారి ఉపఎన్నిక జరిగితే బాణసంచా పేల్చేవారు. ఈ సారి లైట్ తీసుకున్నారు. కౌంటింగ్ రెండో తేదీన జరగనుంది.