ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ టెస్టులు చేస్తున్నారు.. తెలంగాణలో ఎందుకు చేయడం లేదని.. కొంత మంది అడుగుతున్నారని.. తాము లక్షణాలు లేని వారికి కూడా అడ్డగోలుగా టెస్టులు చేయడం లేదని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నిర్మోహమాటంగా ప్రకటించారు. రోజవారీ కరోనా అప్ డేట్ ప్రకటించేందుకు ప్రెస్‌మీట్ పెట్టిన ఈటల రాజేందర్.. టెస్టుల విషయంలో తెలంగాణ వెనుకబడిపోయిందని వస్తున్న విమర్శలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. తాము ఐసీఎంఆర్ నిబంధనలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ర్యాపిడ్ టెస్టులు చేసే ప్రసక్తే లేదని.. ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని గుర్తు చేశారు. తమ టెస్టుల వివరాలన్నీ డైనమిక్‌గా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోజుకు సగటున ఆరు వేలకుపైగా టెస్టులు చేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించుకుంది. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రమని క్లెయిమ్ చేసుకుంది. అయితే.. ఐసీఎంఆర్ మాత్రం.. కేవలం ఆర్టీ – పీసీఆర్ టెస్టులు మాత్రమే ప్రామాణికమని స్పష్టం చేసింది. ఈ ల్యాబుల సామర్థ్యం మొత్తం కలిపితే.. ఏపీలో రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల టెస్టులు చేయడం కష్టతరం. అయితే ఏపీ సర్కార్ కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్లతో.. టెస్టులు నిర్వహించేసి.. వాటినే.. ఫలితాలుగా ప్రకటిస్తోంది. దేశంలోనే తాము అత్యంత ప్రభావవంతంగా పని చేస్తున్న రాష్ట్రంగా చెప్పుకొచ్చింది. ఈ టెస్టుల లెక్కలను ఈటల రాజేందర్ తేలిగ్గా తీసి పడేశారు.
తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఆరు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని మంత్రి ప్రకటించారు. 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం పాజిటివ్ కేసులు 1009 కాగా.. 25మంది మృతి చెందారని…374 మంది డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశారు. యాక్టివ్ కేసులు 610 మాత్రమే ఉన్నాయని ఈటల ప్రకటించారు. తెలంగాణలో 22 జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నాయని… తెలంగాణలో చేపడుతున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తిగా ఉందన్నారు.