ఈటల రాజేందర్ సోమవారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. జేపీ నడ్డా సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది. అంతకు ముందే ఆయన బీజేపీకి చెందిన కీలక నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ వెంట.. టీఆర్ఎస్లో పెద్దగా ప్రాధాన్యం దక్కని ఉద్యమకాలం నాటి నేతలు కొంత మంది ఉన్నారు. ఈటల ఢిల్లీకి వెళ్లడానికి ముందే.. ఆయన భార్య జమున ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వ వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కోసం.. కేసీఆర్ కోసం.. తాము ఎంత చేశామో వివరించారు.
తమ ఆస్తులతో పాటు.. తమపై కేసులు పెట్టి వేధించేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తూండటంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా కౌంటర్ ఇవ్వడానికి బీజేపీని ఈటల ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. ఈటలకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు.. ఆయన భార్యకు.. ఎమ్మెల్యే టిక్కెట్‌ను బీజేపీ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ.. తెలంగాణలో పుంజుకున్నట్లుగా కనిపించినా.. అది గాలి బుడగగానే మారింది. వరుస పరాజయాలతో.. మళ్లీ వెనక్కి తగ్గాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు.. కొత్త నేతల్ని చేర్చుకుని మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈటలపై పెద్ద హామీలే ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేరకుండా నిలుపుదల చేసేందుకు కాంగ్రెస్నేతలతకో పాటు… రేవంత్ సన్నిహితులు కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. ఉద్యమ పార్టీ పెడదామని కోదండరాం లాంటి వారు వచ్చి నచ్చచెప్పినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ ఉంటుందని నమ్మకమో.. ప్రస్తుతానికి కేసీఆర్ వైపు నుంచి జరుగుతున్న దాడి నుంచి తనను తాను కాపాడుకోవడానికే.. బీజేపీకే ఓటు వేశారు.