ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బహిష్కరించబోతున్నాం.. ఆయన శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయిస్తాం.. అని నాలుగు రోజుల నుంచి చెబుతున్న టీఆర్ఎస్ పెద్దలు.. అన్నీ మాటల వరకే రానిచ్చారు. మరో వైపు.. దేవరయాంజల్ గ్రామంలోని సీతారామస్వామి ఆలయ భూముల్ని ఆక్రమించుకున్నారని.. వేసిన ఐఏఎస్‌ల కమిటీ… నియమించిన వెంటనే.. ఆభూముల్లో వాలిపోయింది కానీ… మెదక్ జిల్లా భూముల విషయంలో ఇచ్చినంత చురుకుగా లేదు. కనీసం ప్రాధమిక నివేదిక కూడా సమర్పించలేదు. మీడియాకు మాత్రం.. ఆ భూముల్లో ఈటల భార్య పేరుతో ఉన్న గోదాములకు అనుమతులు లేవని లీకులిచ్చారు. దీంతో అసలేం జరుగుతుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. ఈటలపై దూకుడుగా నిర్ణయాలు తీసుకుని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల.. ధిక్కార ప్రకటనలు చేస్తున్నారు. ఆత్మగౌరవాన్ని అమ్ముకోబోనని తేల్చి చెబుతున్నారు.
అంతే కాదు.. ఆయన చాలా పెద్ద ప్లాన్‌లోనే ఉన్నారని… హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి చేస్తున్న హడావుడితోనే తేలిపోతోంది. ఐదారు వందల కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి హూజూరాబాద్ వెళ్లిన ఈటలకు అక్కడ అనుచరులు ఘనస్వాగతం పలికారు. రోజూ పెద్ద ఎత్తున స్థానిక నేతలు వచ్చి కలుస్తున్నారు. జిల్లాల్లోనూ ఈటలకు మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి.. ఇక తాము వేయడం కన్నా… ఈటలనే రాజీనామా చేస్తే బెటరన్న అంచనాకు టీఆర్ఎస్ హైకమాండ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఆయనపై రాజీనామాకు ఒత్తిడి తేవాలని వ్యూహం పన్నుతున్నారు. కానీ… కేసీఆర్ రాజకీయ శైలి గురించి బాగా తెలిసిన ఈటల మాత్రం.. కొత్త వాదన ప్రారంభించారు.
గతంలో అన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లమన్న డిమాండ్‌ను వినిపిస్తూ.. గజ్వేల్ నుంచి కేసీఆర్ కూడా రాజీనామా చేద్దామని.. ఎవరు గెలి్సతే.. వారే టీఆర్ఎస్ ఓనర్లు అనే వాదన తెస్తున్నారు. దీంతో ఈటల వివాదం విషయంలో టీఆర్ఎస్ దూకుడు తగ్గించినట్లుగా కనిపిస్తోంది. ఈటలను టార్గెట్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో పెరిగితే సానుభూతి వస్తుందని.. ముందుగా ఆ విషయంపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నారంటున్నారు. మొత్తానికి ఈటల రాజీనామా చేయాలని టీఆర్ఎస్.. కాదు టీఆర్ఎస్సే బహిష్కరించాలని ఈటల వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారు కానీ.. దానిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఈటలను కూడా అలాగే వదిలేస్తారని అంటున్నారు.