బీజేపీలో కిషన్ రెడ్డి – బండి సంజయ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా? ఈటల రాజకీయం ఈ ఇద్దర్నీ ఏకం చేసిందా? కమలం కాంపౌండ్ లో ఇప్పుడు ఈ అంశాలపై చర్చ జరుగుతోంది.
బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మొదట్లో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచిందనేది ఓపెన్ సీక్రెట్. మోడీ 3.o లో కేంద్ర కేబినెట్ లో ఇద్దరికీ చోటు దక్కినా తెలంగాణకు వచ్చేసరికి బండి – కిషన్ రెడ్డిల మధ్య పార్టీ పదవుల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే, కొన్నాళ్లుగా కిషన్ రెడ్డికి మద్దతుగా బండి వ్యవహరిస్తుండటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కిషన్ రెడ్డి నాయకత్వంపై తరుచు అసంతృప్తి వ్యక్తం చేసే ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఇటీవల బండి కలిసి బుజ్జగించారు. పార్టీకి, నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించగా, అందుకు ఆయన కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి పై అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను బండి ఖండించడం కొత్త చర్చకు దారితీసింది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రేసు నడుస్తోంది. హైకమాండ్ ఈటలకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఓ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ, బండి, కిషన్ రెడ్డిలు ఈటల నాయకత్వాన్ని అంగీకరించడం లేదని అందుకే, ఈటల టార్గెట్ గా ఇద్దరు ఏకం అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా, బండి ఇటీవల కలిసిన రాజాసింగ్ కూడా ఈటల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే కావడం గమనార్హం.