…ఇదీ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన. ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నిర్వహించేందుకు చూపించిన స్ఫూర్తి, తెలంగాణ లాక్ డౌన్ మొదటి రోజున కనిపించలేదన్నది వాస్తవం! హైదరాబాద్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ యథాతథంగా ఉంది. దుకాణాల దగ్గర గుంపులుగా దర్శనమిచ్చారు. ఈ పరిస్థితిపై రాష్ట్రంతోపాటు, దేశవ్యాప్తంగా ఇలాంటి వాతావరణం కొంత కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా… నెలాఖరు వరకూ ఇళ్లకే పరిమితం కావాలంటూ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశమై తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్నటి స్ఫూర్తి ఇవాళ్ల ప్రజల్లో కనిపించడం లేదన్నారు. నెలాఖరు వరకూ ఇండ్లలో ఉండాలని కోరితే, కొంతమంది కొంపలు మునిగిపోయినట్టుగా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు ఈటెల. ఈ పదిరోజులు చాలా కీలక సమయమనీ, జాగ్రత్తగా ఉంటే వైరస్ ని తరిమి కొట్టొచ్చన్నారు. బాధితుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తగా ఉందామనీ, వైరస్ సోకిన తరువాత నయం చేయడం చాలా కష్టమని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమౌతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేజ్-2 వచ్చిందనీ, దయచేసి దీన్ని స్టేజ్-3 వరకూ రానీయొద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోం క్వారంటైన్లో ఉన్నవారు 14 రోజుల వరకూ ఎక్కడి కదలొద్దన్నారు. రెండు వారాల తరువాత వారికి వైద్య పరీక్షలు జరిపిన తరువాతే బయటకి పంపిస్తామన్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారు బయట ఎక్కడైనా తిరిగితే కేసులు పెడతామనీ, వాళ్లెక్కడున్నా ట్రాక్ చేసి మరీ పట్టుకుంటామన్నారు. ఈ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు క్లాప్స్ కొట్టమంటే… చాలా చోట్ల గుంపులు గుంపులు చేరి ఆ పనిచేసిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈరోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది..? చాలామందిలో కొంత అవగాహన రాహిత్యం కూడా ఉందని కనిపిస్తోంది. ప్రస్తుతం రెండో స్టేజ్ అంటే… వైరస్ సోకిన వారి నుంచి స్థానికంగా మరొకరికి వ్యాప్తి చెందడం. ఈ క్రమంలో ప్రస్తుతం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని మంత్రి చెప్పారు. ఈ దశలో వ్యాప్తిని ఆపగలిగితే పరిస్థితి విషమం కాకుండా నియంత్రించుకోవచ్చు. ఈ సందర్భంలో ప్రభుత్వాల బాధ్యత కంటే, ప్రజల బాధ్యత, అవగాహన, స్వీయ నియంత్రణ ఎక్కువగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.