కేసీఆర్ బలాలు..బలహీనతలేమిటో తెలుసని ప్రతీకారం తీర్చుకోకుండా వదిలి పెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆయన ఇటీవల కేసీఆర్ను టార్గెట్ చేసుకుని రోజూ ప్రకటనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న పార్టీ ఆదేశిస్తే కేసీఆర్పై పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన తాజాగా కేసీఆర్పై పగ తీర్చుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు మొత్తం తెలిసిన వాడినని… ఆయన ఎంత గట్టిగా కొడితే అంత ఎక్కువగా పోరాడుతానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎంత గట్టిగా మాట్లాడతాడో అంత పిరికివాడన్నారు.
హుజురాబాద్లో గెలుపును పక్కదోవ పట్టించడం కోసం ఎన్నో ఎత్తుగడలు వేశారన్నారు. హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ను కొట్టిన దెబ్బకు వచ్చి ధర్నాచౌక్ లో పడ్డాడని… భూమిమీదకు దిగివచ్చారన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని.. ప్రగతిభవన్ ఇనుపకంచెలు కూడా తొలగిపోవాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీది ప్రళయం ఉంటుంని దాన్ని కేసీఆర్ తట్టుకోలేరన్నారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు టీఆర్ఎస్లోనూ కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్ భూములు కబ్జా చేశారని కలెక్టర్ ప్రెస్మీట్ పెట్టి చెప్పారు.
దానిపైనా ఈటలతో పాటు ఆయన భార్య కూడా సీరియస్గా రియాక్టయ్యారు. ఇప్పుడు కేసీఆర్ను వదిలిపెట్టనని ఈటల సవాల్ విసురుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న ఈటల మాటలు సహజంగానే టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేతపై కేంద్రం గురి పెట్టిందన్న ప్రచారమే దీనికి కారణం.