ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు లేఖ పంపారు. గవర్నర్ ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈటలకు సంబంధించిన కోళ్ల ఫారం కోసం అసైన్డ్ భూములను కబ్జా చేశారని మెదక్ జిల్లా కలెక్టర్ ఆరు పేజీల నివేదికను సీఎస్‌కు సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా.. ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను.. అనుకూల మీడియాకు ముందుగానే లీక్ చేశారు. కొన్ని చానళ్లు మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఏముందో… ఎన్నికల ఫలితాల హడావుడిలోనూ.. అక్షరం పొల్లు పోకుండా… విశ్లే్షణ చేశాయి. ఆ తర్వాత బర్తరఫ్ ఉత్తర్వులు విడుదల చేశారు.
మరో వైపు ఈటల రాజేందర్‌కు చెందిన పౌల్టీ ఫాంలో గుర్తించిన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆయా భూముల్లో ప్రభుత్వ భూములనే బోర్డులను ఉంచారు. వారం రోజుల్లో స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాలపై ఈటల రాజేందర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. మంత్రి పదవికి రాజీనామా చేసే అంశంపై ఈటల సమాలోచనలు జరుపుతున్నారు. తన పౌల్టీ ఫాంపై వచ్చిన ఆరోపణల విషయంలో నివేదికల కోసం ఆయన చూస్తున్నారు. నివేదికలొచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఒక్క రోజు కిందటే.. ఆయన శాఖలను తప్పించిన ప్రభుత్వం.. మరోసారి వెంటనే… పదవి నుంచి బర్తరఫ్ చేసేసింది.
మొదటి విడత తెలంగాణ సర్కార్‌లో వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను కూడా… ఇలాగే అవినీతి ఆరోపణలతో అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అప్పట్లో ఆయనను కూడా రాజీనామా చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అడగలేదు. ఇప్పుడు ఈటల రాజేందర్‌ని కూడా.. భూకబ్జా ఆరోపణల కారణంగా రాజీనామా చేయమని అడగలేదు. నేరుగా గవర్నర్‌కు లేఖ పంపి.. బర్తరఫ్ చేయించేశారు. కేసీఆర్‌కు కోపం వస్తే అంతేనని.. టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.