బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ … తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారు. అది ఆయన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడ కాదు. ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఆయన చెప్పకనే చెప్పేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన .. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని.. స్పష్టం చేశారు. చేరికల కమిటీ చైర్మన్ గా బీజేపీలో చేరాలని వారితో చర్చలు జరిపితే.. రివర్స్ లో తనకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. ఎందుకా కౌన్సెలింగ్ అని చెప్పలేదు కానీ.. తిరిగి ఈటలనే కాంగ్రెస్ లో చేరదాం రమ్మని అడుగుతున్నట్లుగా భావిస్తున్నారు.
వాళ్లిద్దరూ బీజేపీలో చేరడానికి ఇష్టపడకపోవడానికి కారణాలు కూడా చెబుతున్నారు ఈటల. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల చెప్పుకొచ్చారు. ఈ ప్రకారం చూస్తే.. ఈటల కూడా.. రేపో మాపో .. కౌన్సెలింగ్ కి కరిగిపోతారేమో తెలియదు కానీ..ఆయనను పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. పదే పదే పేరు పెట్టి పిలుస్తున్నారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు వారు బీజేపీలో చేరరని అంటున్నారు. బీజేపీని కల్పనా రాయ్‌గా.. కాంగ్రెస్ ను ఐశ్వర్రాయ్‌గా పోల్చుతూ.. పెళ్లి చూపులు చూస్తున్నారని..ఎవర్ని ఎంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇతర నేతలందర్నీ కూడా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ను కూడా పిలుస్తున్నారు. ఏలా చూసినా .. చేరికల కమిటీ చైర్మన్ ఈటల వారిద్దర్నీ బీజేపీలోకి ఆకర్షించడంలోకి విఫలమయ్యారు. మరి ఈటల చెప్పినట్లుగా వారి రివర్స్ కౌన్సెలింగ్ వారిపై ఏమైనా ప్రభావం చూపిందో లేదో త్వరలోనే తేలనుంది.