టీఆర్ఎస్లో మిస్టర్ కూల్.. ఈటల రాజేందర్ ఒక్క సారిగా బరస్టయ్యారు. కొంత కాలంగా.. తన చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఆయన కడుపులో దాచుకోలేకపోయారు. సొంత నియోజకవర్గంలో.. నేతల సమావేశంలో ఒక్క సారిగా ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మంత్రి పదవి నుంచి తనను.. త్వరలో తొలగించబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. తన మంత్రి పదవి ఎవరి భిక్షా కాదని సూటిగా.. హైకమాండ్‌కు తగిలేలా ప్రకటించారు. తాము పార్టీలోకి మధ్యలో వచ్చిన వారం కాదని…గులాబీ జెండా యజమానులమని..సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల మాటలు ఓ రకంగా ధిక్కారంగానే కనిపిస్తోంది.
సొంతంగా ఎదగలేనివారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈటల పరోక్షంగా నేతలను హెచ్చరించారు. టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపైనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. ధర్మం, న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదుని హెచ్చరించారు. తాము అడుక్కునే వాళ్లం కాదు.. అడుక్కునే వాళ్లు ఎవరో త్వరలో తెలుస్తుందన్నారు. అధికారం శాశ్వతం కాదు, ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని… నాయకులు కాదు, ప్రజలే చరిత్ర నిర్మాతలని గుర్తు చేసుకోవాలన్నారు.
ఈటల వ్యాఖ్యలు… తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈటల రాజెందర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ కు మద్దతుగా ఉండే పత్రికల్లో.. ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఈటల కట్టుకుంటున్న ఇంటిపైనా.. అవినీతి ఆరోపణలతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇవన్నీ… టీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసే వస్తున్నాయన్న క్లారిటీ రావడంతో.. ఈటల మరింత ఆవేదనతో ఒక్క సారిగా బయట పడ్డారని అంటున్నారు. ఈటల తిరుగుబాటు టీఆర్ఎస్ హైకమాండ్ పైనే అని స్పష్టంగా తెలుస్తోంది.