తెలంగాణ బీజేపీ పార్టీ తరపున ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు.అయితే ఆయన చేస్తున్న రాజకీయం మాత్రం ఆ పార్టీవారిని గందరగోళంలో పడేస్తోంది.తాము రేవంత్ ప్రభుత్వంపై పోరాడలేదని ఆయన బయట చెబుతున్నారు. ప్రతిపక్షంగా పోరాడలేదని ఒప్పుకోవడం ఏమిటో ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. బీఆర్ఎస్ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం చేయలేదా.. నేరుగా రోడ్ల మీదకు రాలేదా అన్నది ఆయన చెప్పాల్సి ఉందని మండిపడుతున్నారు.
ఈ ఒక్క విషయంలోనే కాదు హైడ్రా విషయంలోనూ బీజేపీ నేతల తీరును ఆయన వ్యతిరేకించారు. హైడ్రాను మొదలు పెట్టినప్పుడే తాను వ్యతిరేకించానని కానీ మా పార్టీలోని కొందరు అనుకూలంగా ప్రకటనలు చేశారని అంటున్నారు. ఇలా తన అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడిన వారందర్నీ ఆయన తప్పు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం కంటే గతంలో కేసీఆర్ సర్కారే చాలా బాగుండేదని అంటున్నారు. ఈటల మాట తీరు చూసి సీనియర్ బీజేపీ నేతలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని కోరుకున్నారు. ఆయనచేతికి వచ్చినట్లే అనుకున్నారు. కానీ బీజేపీలో అంత తేలికగా ఏదీ రాదు. ఇప్పుడు పెండింగ్ లో పడిపోయింది. ఆయన వెనుకబడిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈటల ఇలా ధిక్కార స్వరం వినిపించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ హైకమాండ్ ఈటల తీరును ఎలా తీసుకుంటుందన్నదే కీలకం.