తెలంగాణలో నేతల మధ్య ఎలా సమన్వయం సాధించాలో బీజేపీ పెద్దలకు అర్థం కావడం లేదు. బండి సంజయ్ ను మార్చాల్సిందేనని పార్టీలో చేరిన నేతంలతా కోరుతున్నారు. ఇలాంటి సమయంలో కరెక్ట్ కాదని హైకమాండ్ చెబుతోంది. ఈటల రాజేందర్ కు కీలక పదవి ఇస్తామని చెబుతున్నారు కానీ.. ఎలాంటి ప్రకటనా రావడం లేదు. మరో వైపు అందరూ మాట్లాడుకుని కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం గుప్పు మంది. దీంతో బీజేపీ హైకమాండ్ కంగారు పడింది. మరోసారి ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకుంది.
ఇప్పటికే చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఈటలకు మరో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని సంకల్పించారు. అందుకే ఆయన్ని ఢిల్లీ పిలిచి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత అసలే పార్టీ సమస్యల్లో ఉంటే ఇప్పుడు నేతల మధ్య విభేదాలు పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా వేరే పార్టీల నుంచి చేరిన వారు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరికొందరు ఆపార్టీలో చేరుదామా అన్ని కొన్ని రోజులుగా ఆలోచించిన వాళ్లు ఇప్పుడు బీజేపీ వైపు చూడటానికే ఇష్టం పడటం లేదు.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీ నేతలకు గాలం వేసేందుకు ఏర్పాటు చేసిన చేరికల కమిటీ చైర్మెన్ ఈటెల సైతం విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల పొంగులేటి, జూపల్లి వంటి కీలకనేతలను బిజేపిలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అంతే కాదు వారిని ఆహ్వానించడానికి వెళ్లిన ఈటెలను, నువ్వే కాంగ్రెస్‌లోకి వచ్చేయమంటూ ఒప్పించే ప్రయత్నం చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధినాయకత్వం అర్జెంటుగా ఆయన్ని పిలిచి మాట్లాడుతోందని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయన అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డారు. ఇప్పట్లో బండి సంజయ్‌ను మార్చే ఉద్దేశం లేదని అధినాయకత్వం చెప్పడంతో ఆయన అప్పటి నుంచి కాస్త సైలెంట్ అయ్యారు. వీటన్నింటినీ గమనించిన అధిష్ఠానం ఏమని బుజ్జగిస్తుందో చూడాల్సి ఉంది.