స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం లేదు. ఎక్కడా బీజేపీ పోటీ చేయడానికి తగినంత బలం లేదు. కానీ ఆ పార్టీకి చెందిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు సైలెంట్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని నిలబెట్టారు. పోీట చేయాలని బీజేపీ అనుకోలేదు. పోటీ చేయకూడదని అధికారిక నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఇండిపెండెంట్లను ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిలబెట్టడం.. తామే నిలబెట్టామని చెప్పుకోవడం అనూహ్యంగా మారింది.
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీలో నిలిచి ఏకగ్రీవాలు కాకుండా చూడాల్సిందని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. పోటీ ఏదైనా.. గెలుపా.. ఓటమా అన్నది కాకుండా బరిలో నిలవాల్సిందని ఆయన అంటున్నారు. కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న రవీందర్ సింగ్ కు ఈటల ప్రోత్సాహం ఉంది. ఆదిలాబాద్‌లోనూ తానే స్వతంత్ర అభ్యర్థిని పోటీలో నిలిపినట్లు ఈటల ప్రకటించారు. ఈ రెండు చోట్లా తాను అభ్యర్థులను గెలిపించుకుంటానని కూడా చెప్పారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ నేత ఒకరు పోటీలో ఉన్నారు. ఈటల ఆమెకు మద్దతిచ్చి గెలిపించే అవకాశం ఉంది.
మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా ఓ ఇండిపెండెంట్‌ను బరిలోకి దింపారు. పార్టీకి ఉన్న ఓట్లు పక్కకుపోకుండా ఉండాలంటే కీలక నిర్ణయం తీసుకోకతప్పలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీ హైకమాండ్ నిర్ణయాన్ని ఈటల , రఘునందన్ రావు ధిక్కరించారు. ఆ విషయాన్ని నేరుగానే చెబుతున్నారు. మరి వీరిపై బీజేపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.