ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్‌కు తన సీటుపై కూడా టెన్షన్ పెట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా సరే ఈటల రాజేందరే అభ్యర్థిగా నిలబడనున్నారు. ఈ విషయాన్ని ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులకు స్వయంగా చెప్పారు. గజ్వేల్ నుంచి ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందని తాను సీరియస్‌గా గజ్వేల్‌లో వర్క్ చేస్తున్నానని ప్రకటించారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది కూడా గజ్వేల్లోనేనన్నారు. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీపై అప్పటి వరకూ టీఎంసీలో ఉన్న సువేందు అధికారి బీజేపీలో చేరి పోటీ చేసి గెలిచారు.
అయితే అక్కడ సువేందు అధికారి స్థానంలోకి మమతా బెనర్జీనే వెళ్లి పోటీ చేశారు. ఇక్కడ ఈటల రాజేందర్ మా త్రం తాను స్వయంగా కేసీఆర్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెబుతున్నారు. కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందని ఈటల రాజేందర్ చెబుతున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదని టీఆర్ఎస్ వర్గాల్లో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ స్థానాన్ని గత రెండు సార్లు తనపై పోటీ చేసి ఓడిపోయి.. టీఆర్ఎస్లో చేరిన ప్రతాపరెడ్డికి ఇస్తారని చెబుతున్నారు.
అయితే అదంతా బీజేపీని రాంగ్ రూట్లో పంపడానికి కేసీఆర్ వేస్తున్న వేషాలని ఆయన గజ్వేల్‌లోనే పోటీ చేస్తారని.. అక్కడ ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోతానని భయపడితే.. హరీష్‌ను బలి చేసి తన పాత నియోజకవర్గం సిద్ధిపేటకు వెళ్తారని .. అంతే కానీ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయరని అంటున్నారు. అయితే ఎక్కడ పోటీ చేసినా ఆయనపై ఈటల రాజేందర్ పోటీ ఖాయమని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.