ఈటల రాజేందర్ బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నారు. బండి సంజయ్ నేతృత్వంలో పని చేయడం కష్టమని..తనను టీ బీజేపీ చీఫ్ గా నియమించాలని ఆయన ఢిల్లీ వెళ్లి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన కోసం పార్టీలో గత కొంత కాలంగా చేరిన నేతలంతా తమ మద్దతను తెలియచేశారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బండి సంజయ్ ను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో .. అందరూ వెనక్కి వచ్చేశారు. ఈటల కూడా తనకు పదవి ఇవ్వరని తనను ఎలా వాడుకోవాలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
ఇలా చెప్పిన తర్వాత రోజునే ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ సమావేశం అయ్యారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అందరూ కలిసి కాంగ్రెస్ లోకి వెళ్ల ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం గుప్పుమంది. బీజేపీకి ఖమ్మం జిల్లాలో కార్యకర్తలు కూడా లేరని.. ఆ పార్టీలో చేరి ఏమి చేయాలన్నట్లుగా పొంగులేటి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అందరికీ అర్థమయింది. అయితే వారితో ఈటల చర్చలు దేనికోసమన్నది స్పష్టత లేదు.
కొత్తగా చేరే వారికి ముఖ్యంగా ఈటల రాజేందర్ చర్చలు జరిపి చేరే వారికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. బండి సంజయ్ కూడా.. సర్వేల్లో మెరుగైన స్థానం వస్తేనే టిక్కెట్లు ఇస్తామని చెబుతున్నారు. కొత్తగా చేరే వారికీ ఇదే వర్తిస్తుందంటున్నారు. పొంగులేటి, జూపల్లి.. రెండు జిల్లాలను తమకు అప్పగించాలని అడుగుతున్నారు. ఈటలకే గ్యారంటీ లేని పరిస్థితుల్లో వారికి బీజేపీ తరపున ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం లేదని.. అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడమో లేదా .. కొత్త పార్టీ పెట్టడమో అన్న ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా వచ్చే ఒకటి, రెండు వారాల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.