భారతీయ జనతా పార్టీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జేపీ నడ్డా టూర్ కు డూమ్మా కొట్టి మరీ ఢిల్లీలోనే మకాం వేశారు. శనివారం వారిని బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. అమిత్ షా, నడ్డా వారితో మాట్లాడారు. కిషన్ రెడ్డి కూడా వారితో పాటు చర్చల్లో పాల్గొన్నారు. ఆదివారం జేపీ నడ్డా తెలంగాణలోని నాగర్ కర్నూలు పర్యటనకు వచ్చారు. అయితే ఆ నేతలు మాత్రం తెలంగాణకు రాలేదు.
మధ్యాహ్నం వరకు రాజగోపాల్ రెడ్డితో ఈటల మంతనాలు సాగించారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు తమ పార్టీ జాతీయాధ్యక్షుడి కార్యక్రమానికి కూడా హాజరుకాకుండా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వివిధ రకాల ఊహాగానాలు చెలరేగాయి. నేతలిద్దరూ కాంగ్రెస్లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నందున అందులో చేరడమే ఉత్తమమని నేతలిద్దరూ భావిస్తున్నారని ప్రచారం ప్రారంభమయింది. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడురాహుల్ ను కలిసేందుకు జూపల్లి, పొంగులేటి తో పాటు మరికొంత మంది నేతలు వస్తున్నారు. వీరితో పాటు ఈటల, కోమటిరెడ్డి చేరుతారన్నప్రచారం ఊపందుకుంది.
అయితే ఈటల , రాజగోపాల్ రెడ్డిల వర్గీయులు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన ిచెబుతున్నారు. పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత ఉండడం లేదని, అందరినీ కలుపుకోకుండా ముందుకెళ్తే గెలుపు కష్టమని చెప్పినా హైకమాండ్ పట్టించుకోవడం లేదని పూర్తి స్థాయిలో హామీ కూడా రావడం లేదని వారంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తన మనసులో ఉన్నది చెప్పాలని వారు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా బీజేపీలో సంక్షోభం సమసిపోయే అవకాశాలు కనిపించడం లేదు.