ముఖ్యమంత్రి కేసీఆర్ మనోభావాలకు విరుద్ధంగా తెరాస మంత్రులుగానీ ఎమ్మెల్యేలుగానీ వ్యవహరించరు! కానీ, ఒక్కోసారి ఆ గీత దాటుతున్నట్టుగా ఈ మధ్య కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. అసలైన గులాబీ బాసులం మేమే అంటూ వ్యాఖ్యానించి, ఆ మధ్య చర్చకు దారి తీశారు. ఇటీవలే… పార్టీలో కొన్ని వ్యతిరేక పరిణామాలు జరుగుతున్నాయనీ, అసెంబ్లీ ఎన్నికల్లో తనని ఓడించాలని కొందరు ప్రయత్నించినా ప్రజలు ధర్మం తప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో… యూనియన్ల గురించి మాట్లాడి, మరో చర్చకు తెర లేపినట్టు ఈటెల చేశారు.
యూనియన్లు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, కొన్ని వర్గాల పట్ల చిన్నచూపు అణచివేత ధోరణి ఇప్పటికీ కొనసాగుతోందన్నారు మంత్రి ఈటెల. యూనియన్లతో పనేముందని కొంతమంది మాట్లాడుతున్నారనీ, అన్నీ ఉన్నోడికి వాటితో పనిలేదనీ, తమలాంటి అణచివేతకు గురౌతున్నవారికి యూనియన్లు అవసరమన్నారు. అన్ని రంగాల్లో కొంతమంది మీద వివక్ష ఉందనీ, అలాంటివారి హక్కుల్ని కాపాడాల్సి ఉందన్నారు. విలువల గురించి మాట్లాడుతున్నవారే, వాటిని తీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంతమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు మారుతున్నా అణగారిన వర్గాలకు రాజ్యాంగం అందించిన ఫలాలు దక్కడం లేదన్నారు. అణగారిన వర్గాలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాలన్నారు. పోరాడితే తప్ప హక్కులు దక్కవని చరిత్ర చెబుతుందన్నారు. అన్ని రంగాలకు యూనియన్ల అవసరం ఉందని సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈటెల వ్యాఖ్యానించారు.
యూనియన్లు ఉండొద్దు అనేది సీఎం కేసీఆర్ అభిప్రాయం. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో అన్ని రకాల యూనియన్ల గురించీ ఆయన ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటితోనే తలనొప్పి వస్తోందనీ, అవి లేకపోతే అభివృద్ధి జరుగుతుందన్నారు. అంతేకాదు… యూనియన్ల నాయకుల పట్ల ముఖ్యమంత్రి కొంత నిర్లక్ష్య ధోరణిలోనే వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఉపాధ్యాయ యూనియన్లు, రెవెన్యూ ఉద్యోగుల యూనియన్ల నేతలకు ముఖ్యమంత్రి కార్యాలయంలో అపాయింట్మెంట్లు కూడా దక్కడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. పరోక్షంగా ఈ పరిస్థితిని మంత్రి ఈటెల ప్రశ్నించారా అనే అర్థం వస్తోంది! యూనియన్లు వద్దు అనేది ముఖ్యమంత్రి అభిప్రాయం అని అందరికీ తెలుస్తున్నదే… లేదూ, కచ్చితంగా ఉండాలంటే ఇది సీఎం అభీష్టానికి విరుద్ధమైన అభిప్రాయంగా కనిపిస్తోంది!