తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఓ రేంజ్లో సాగుతోంది. అయితే ఇది ఇంకా బయటపడలేదు. అంతర్గతగానే ఉంది. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాను వేములవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆయన నియోజకవర్గం కరీంనగర్. అక్కడ నుంచి అసెంబ్లీకి గతలో రెండు, మూడు సార్లు పోటీ చేశారు. ఆయనకు అక్కడ పలుకుబడి ఉంది. కానీ మంచి సేఫ్ జోన్ అని అయన వేములవాడను భావిస్తున్నారు. అందుకే అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. కానీ వేములవాడ నుంచే తాను పోటీ చేయబోతున్నామని మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ ప్రకటించేశారు.
ఈటలతో పాటు పార్టీలో చేరిన కీలక టీఆర్ఎస్ నేతల్లో తుల ఉమ ఒకరు. మాజీ నక్సలైట్ అయిన ఆమె తర్వాత రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్లో చేరారు. ఈటల అండతో కొన్ని కీలక పదవులు పొందారు. ఆమెకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరారు. చేరినప్పుడే వేములవాడ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఈటల రాజేందర్ కూడా ఆమెకు తప్పనిసరిగా టిక్కెట్ ఇప్పించాలని డిసైడయ్యారు. అందుకే నియోజకవర్గంలో పని చేసుకోవాలని చెప్పి పంపారు. ఇప్పుడు ఆమె వేములవాడ మొత్తం పర్యటిస్తూ.. తానే పోటీ చేస్తానని చెబుతున్నారు.
తాను వేములవాడ నుంచి పోటీ చేస్తానని బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించలేదు. కానీ పార్టీ నాయకులకు మాత్రం చెబుతున్నారు. ఇప్పుడు ఆయన సీటుకు ఈటల అడ్డం పడుతున్నట్లయింది. ఇప్పటికే ఈటల – బండి సంజయ్ మధ్య పెద్దగా మాటల్లేవు. టిక్కెట్లు ఆశ చూపి తన వర్గాన్ని పార్టీలోకి తెస్తున్నారని బండి సంజయ్ ఫైరవుతున్నారు. ఇప్పుడు నేరుగా ఆయన పోటీ చేయాలనుకుంటున్న సీటులోనే ఈటల మనిషి తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడం … బండి సంజయ్‌కు ఇబ్బందికరమే.