కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలో ఈటల రాజేందర్ ప్రకటించారు. అది గజ్వేల్ అయినా మరొకటి అయినా సరే తాను రెడీ అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు అదే క్లారిటీ వచ్చేసినట్లుగా ఉంది. ఈటల రాజేందర్‌నే కేసీఆర్‌పై పోటీకి దింపాలని బీజేపీ హైకమాండ్ డిసైడయిందని.. ఆ మేరకు ఈటలకు కూడా నేరుగానే సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవల కొన్ని రోజుల పాటు ఈటల ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై పోటీ, ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఆయనకు బ్లూప్రింట్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
కేసీఆర్ గజ్వేల్‌లో పోటీ చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే ఆయన నియోజకవర్గం మారొచ్చని కొంత కాలం కిందట ప్రచారం జరిగింది. ఇప్పటికి సూచనలు లేవు. అయితే ఈటల రాజేందర్ మాత్రం గజ్వేల్‌లో పని ప్రారంభించారు. తనకు ఉన్న పరిచయాలతో.. ఓ మాదిరిగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. తరచూ గజ్వేల్‌లో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కొంచెం కొంచెంగా మారుతోంది. గతంలో కేసీఆర్‌కు ప్రత్యర్థిగా ప్రతాప్ రెడ్డి ఉండేవారు. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరడంతో ప్రత్యర్థి లేరు. ఈటల అయితే సరైన ప్రత్యర్థి అవుతారన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో ఉంది.
కేసీఆర్, ఈటల మధ్య పోటీ జరిగితే.. ఎజెండా మారిపోతుంది. కేసీఆర్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగానే తాను బరిలో నిలబడ్డానని.. న్యాయం కావాలని ఈటల ప్రచారం చేస్తే సీన్ మారిపోతుంది. టీఆర్ఎస్లో తనకు అన్యాయం చేశారని ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కేసీఆర్ .. టీఆర్ఎస్ అధినేతగా బలంగా నిలబడగలరు.. కానీ గజ్వేల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందే. బెంగాల్లో దీదీని ఆమె నియోజకవర్గంలో ఓడించినట్లుగా చేయాలని బీజేపీ ప్లాన్ వేసుకుంటోందని.. స్పష్టంగా అర్థమవుతోంది.