తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ఎక్కడా ఆయన తెలంగాణ సర్కార్ను విమర్శిస్తున్నట్లుగా కానీ… కేసీఆర్ను అంటున్నట్లుగా లే్దు కానీ… నేరుగా సలహాలిస్తున్నట్లుగా ఉంది. రైతు ఉద్యమం ఎప్పుడో ఓ సారి మన గడప తొక్కకపోదని…ఉద్యమం చేస్తున్న వారితో గొంతు కలపడం బాధ్యత అని ఈటెల నేరుగానే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి ఈటెల.. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ” ఎలుకల బాధకు ఇల్లుని తగలబెట్టుకోవద్దు..” అని నేరుగా సలహా కూడా ఇచ్చారు. అంతా కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉంది కానీ.. తరచి చూస్తే.. కేసీఆర్కు ఈటెల గట్టి సందేశం పంపుతున్నట్లుగా స్పష్టమవుతోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
బీజేపీపై పోరాడాలనేదే.. ఈటెల అభిమతమని… రైతు చట్టాలను వ్యతిరేకించి.. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేదే ఈటెల చెబుతున్నదన్న అభిప్రాయం వినిపిస్తోంది. రైతు చట్టాలపై తీవ్ర వ్యతిరేకత చూపిన కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఆ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆ చట్టం వచ్చింది కాబట్టి.. ఇక పంట కొనుగోలు కేంద్రాలు ఉండవని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఈటెల తీవ్రంగా వ్యతిరేకించారు. తన శాఖ కాకపోయినప్పటికీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో చివరికి పంటను కొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈటెల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రైతు ఉద్యమానికి మద్దతుగా తన వాయిస్ వినిపిస్తున్నారు. కేసీఆర్ తీరుపై అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు.
ఏదో నాడు ఉద్యమం గడప తొక్కుతుందని చెప్పడం.. ఎలుకల బాధకు ఇల్లు తగులబెట్టుకోవద్దని హెచ్చరించడం.. రెండింటిలోనూ .. అర్థం చేసుకోవడానికి చాలా ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ లో చేసినట్లుగా బీజేపీ చేస్తుందన్న భయంతో.. కేసులు పెట్టి వేధిస్తారన్న భయంతో కేసీఆర్ బీజేపీపై పోరాడటం లేదన్న అభిప్రాయం ఉంది. అయితే.. అది ఎలుకల బాధనే ఈటెల చెబుతున్నారని ఆ పేరుతో … ఇల్లు తగులబెట్టుకుంటున్నారని… అంటే పార్టీని నాశనం చేస్తున్నారని ఈటెల అభిప్రాయమంటున్నారు. మరి ఈటెల చెప్పాలనుకుంటున్నది కేసీఆర్ కు అర్థమవుతుందా.. కేసీఆర్ వాటిని పరిగణనలోకి తీసుకుంటారా అన్నది కీలకం.