అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా… రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు వెళ్లవద్దంటూ ఢిల్లీ నుంచి ఎన్ని హెచ్చరికలు వచ్చినా ఏపీ సర్కార్.. ముందుకే వెళ్తోంది. తాజాగా.. రివర్స్ టెండర్లలో కాంట్రాక్టర్‌నూ ఎంపిక చేసింది. ఏపీలో రివర్స్ టెండర్ అంటే.. ముందుగా అందరికీ వినిపించే పేరు మెగా ఇంజినీరింగ్. పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్లన్నీ ఈ సంస్థకే దక్కాయి. వందల కోట్ల తక్కువకు పనులు చేసేందుకు అంగీకరిస్తూ… ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే.. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో మాత్రం మెగా పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. అన్నీ మెగాకే ఇస్తారా అన్న అనుమానాలొస్తాయని మరో విధంగా పనులు చేస్తారేమో కానీ ఇప్పటికే… ప్రాజెక్టుల నిర్మాణంలో ఎప్పుడూ పెద్దగా వినిపించని పేరు ఎస్పీఎంఎల్ జాయింట్ వెంచర్-సుభాష్ ప్రాజెక్ట్స్ ఖరారైంది.
రోజూ మూడు టీఎంసీలను ఎత్తిపోసేందుకుగాను పిలిచిన టెండర్లలో రివర్స్‌లో కూడా 0.88 శాతం ఎక్కువగా బిడ్ పడింది. మొత్తం ఎత్తిపోతల పథకం పనుల అంచనా విలువను రూ.3,278.18 కోట్లు నిర్ణయించి టెండర్లు పిలిచారు. మెగా కంపెనీ అసలు టెండర్లలోనే పాల్గొనలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువకే టెండర్లు వేశాయి సంస్థలు. ప్రస్తుతం కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎస్పీఎంఎల్ జాయింట్ వెంచర్-సుభాష్ ప్రాజెక్ట్స్ దాదాపుగా రెండు శాతం ఎక్సెస్‌కు వేసింది. చివరు రివర్స్ టెండర్లో ఒక శాతానికిపైగా తగ్గించింది. అంచనా ధరలో 0.88 శాతం ఎక్కువకు చేసేందుకు ముందుకు వచ్చింది.
టెండర్లను ఖరారు చేసినా అధికారికంగా ప్రకటించడానికి మాత్రం అవకాశం లేదు. అనేక అవరోధాలు ఉన్నాయి. కేఆర్ఎంబీ పర్మిషన్ రావాల్సి ఉంది. అపెక్స్ భేటీలో దీనిపై తేల్చుకోనున్నారు. డీపీఆర్‌లను సమర్పించాలని, కేంద్ర జల సంఘం ఆమోదం పొందాలని అపెక్స్ కౌన్సిల్లోనూ చర్చించి ఆమోదం తీసుకోవాలని అధారిటీల నుంచి లేఖలు వచ్చాయి. అన్నీ క్లియర్ అయిన తర్వాతే ఒప్పందాలు చేసుకుంటారు. ఇప్పటికే కాంట్రాక్టర్‌ను ఖరారు చేశారు.