ఈ దీపావళికి విడుదల అవుతున్న సినిమాల్లో ‘క’ ఒకటి. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా కోసం కిరణ్ బాగా కష్టపడ్డాడు. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కిరణ్ ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా జనాలకు నచ్చకపోతే, ఇక ఇండస్ట్రీలో ఉండను అంటూ సవాల్ విసిరాడు కిరణ్. ఈ సినిమాపై తాను పెంచుకొన్న నమ్మకానికి ఇది నిదర్శనం.
ఈ సినిమాపై నిర్మాతలు కూడా బాగానే ఖర్చు పెట్టారు. అవి తిరిగి వస్తాయని కూడా గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ల నమ్మకం కొంత వరకూ ఫలించింది. విడుదలకు ముందే ఈ సినిమా ఓటీటీ, శాలిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. రూ.15 కోట్లకు ఈటీవీ ఈ హక్కుల్ని దక్కించుకొంది. శాటిలైట్ ఈటీవీ, డిజిటల్ ఈటీవీ విన్ పంచుకొన్నాయి. రూ.15 కోట్లంటే.. సగం బడ్జెట్ వెనక్కి వచ్చేసినట్టే. ‘క’ పాన్ ఇండియా సినిమా. ఇప్పటికైతే తెలుగులోనే రిలీజ్ అవుతోంది. మిగిలిన భాషల్లో ఓ వారం ఆలస్యంగా వెళ్తుంది. థియేటర్ల నుంచి మంచి స్పందన వచ్చి, మిగిలిన భాషల్లోనూ కాస్తో కూస్తో వసూళ్లు తెచ్చుకొంటే ‘క’ నిర్మాతలు సేఫ్ అయిపోయినట్టే.