సంప్రదాయబద్ధమైన ఛానళ్లలో ఈటీవీదే అగ్రతాంబూలం. అందులో… కాంట్రవర్సీలకుఅవకాశం శూన్యం. చర్చల పేరుతో వాదోపవాదాలు, కొట్టుకోవడాలూ ఉండవు. న్యూస్‌ని న్యూసెన్స్ చేయడాలు ఉండవు. ప్రతీదీ ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. ఓరకంగా దూరదర్శన్‌కి అదో కొత్త వెర్షన్. ఈటీవీ న్యూస్ నేకాదు. ఎంటర్టైన్మెంట్ ఛానళ్లనీ అలానే తీసుకొచ్చారు. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రతీ కార్యక్రమంపైనా ఓ పటిష్టమైన నిఘా ఉండేది. ఆఖరికి… స్లాటెడ్ ప్రోగ్రామ్స్ (జబర్దస్త్ లాంటివి) పై కూడా ఈటీవీ అజమాయిషీ ఉండేది. ఏదైనా కాంట్రవర్సీ వస్తుందనుకుంటే, అలాంటి విషయాల్ని హైడ్ చేయడానికి ఓ వ్యవస్థ పనిచేసేది.
అయితే ఇప్పుడు ఆ కంట్రోల్ తప్పిపోయిందని ఈటీవీలో కొన్ని కార్యక్రమాలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు `దారి` తప్పుతున్నాయి. ఈనాడు గైడ్ లైన్స్ కి దూరంగా వెళ్తున్నాయి. జబర్దస్త్ లో బూతుల ప్రవాహం, పటాస్ లాంటి కార్యక్రమాల్లో డబుల్ మీనింగ్ డైలాగుల హోరూ.. చూసిన వాళ్లంతా విమర్శలు లేవనెత్తారు. వాటిలో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో వేసిన స్కిట్ ఇప్పుడు.. మరో వివాదానికి దారి తీసింది. ఇందులో హైపర్ ఆది అండ్ టీమ్.. బతుకమ్మ పాటని కించపరిచారని, అందుకే హైపర్ ఆదితో పాటు మల్లెమాట టీమ్ కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. హైపర్ ఆదిపై కూడా.. పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనంతటి వెనుక…. ఈటీవీ చూసీ చూడని వైఖరి కూడా కారణభూతమవుతోంది. మల్లెమాట టీమ్ కి స్లాట్ ని అప్పగించినంత మాత్రాన.. ఆ టైమ్ లో వాళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాటిలో వివాదాలకు ఎంత తావుంది? అనే విషయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అనేది మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తున్నమాట. ఎప్పుడైతే.. ఇది ఈటీవీ కార్యక్రమం అయిపోయిందో, అప్పుడు మిగిలిన ఛానళ్లు…ఈటీవీ వైఖరిని కూడా ఎండగడుతూ.. `స్పెషల్` పోగ్రాములు చేస్తున్నాయి. మొత్తానికి ఈటీవీ యాజమాన్యం ఇలాంటి సున్నితమైన విషయాలపై దృష్టి సారించాలి. లేదంటే.. క్లీచ్ ఛానల్ అన్న పేరు చేచేతులా పాడు చేసుకునేవాళ్లవుతారు.