ఇప్పుడు సినిమా ప్రపంచం అంతా ఓటీటీ వైపు చూస్తోంది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి భయపడి, బద్దకిస్తున్న వేళ.. ఓటీటీ చక్కటి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. తెలుగులోనూ మెల్లమెల్లగా ఓటీటీ సంస్క్కృతి అలవాటైంది. వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. సబ్ స్క్రెబ్ చేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. అందుకే తెలుగులో ఓటీటీ వేదికలు పెరుగుతున్నాయి. ఆహా, జీ 5 లాంటి వేదికలు… ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పుడు ఈటీవీ కూడా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టబోతోంది.
రామోజీ రావు ఏం చేసినా దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రంగంలోకి దిగుతారు. ఓటీటీని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈటీవీలో వందల కొద్దీ సినిమాలున్నాయి. అసలు శాటిలైట్ కి ఏమాత్రం డిమాండ్ లేని రోజుల్లో ఈటీవీ వచ్చింది. అప్పట్లో.. కొన్ని వందల సినిమాల్ని వందేళ్ల లీజుకి చాలా తక్కువ ధరకు తీసుకున్నారు. ఈటీవీ లో సినిమాలన్నీ అప్పటివే. ఉషాకిరణ్ మూవీస్ నుంచి వచ్చిన సినిమాలు 100 వరకూ ఉన్నాయి. ఇవన్నీ ఈటీవీలో తప్ప ఇంకెక్కడా చూడలేం. అవన్నీ… ఈ ఓటీటీకి మూలధనం. అయితే వెబ్ సిరీస్‌లూ, టాక్ షోలూ, సినిమాలూ.. ఇవన్నీ కావాలి కదా. అందుకే తొలి విడతగా 200 కోట్లపెట్టుబడి పెట్టబోతోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ లనిర్మాణం, టాక్ షోల విషయంలో కసరత్తు సాగిస్తున్నారు. చిన్న సినిమాల్ని టోకున కొనడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అంతే కాదు.. ఉషాకిరణ్ మూవీస్ లోనే చిన్న సినిమాలు తీసి, వాటిని… ఈ ఓటీటీ ద్వారా విడుదల చేయాలన్నది ప్లాన్. ఇప్పటికే ఈటీవీ కొన్ని స్క్రిప్టుల్ని ఫైనల్ చేసేసింది. వర్థమాన దర్శకులు, ఒక సినిమా తీసి, ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న దర్శకుల్ని పట్టుకుని.. వాళ్ల చేతికి ప్రాజెక్టు అప్పగించాలనుకుంటోంది. కొత్తతరానికి, ప్రతిభావంతులకు మరో మంచి వేదిక దొరికినట్టైంది.