హైదరాబాద్: మొత్తంమీద గ్రీస్ గట్టెక్కింది. యూరోపియన్ యూనియన్ ఆదుకోటానికి ముందుకు రావటంతో గ్రీస్ బయటపడింది. బ్రసెల్స్‌లో యూరోజోన్ నేతలు నిర్విరామంగా నిన్న రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి. మూడేళ్ళ కాలవ్యవధిలో 86 బిలియన్ల యూరోల(61 బిలియన్ పౌండ్ల) ప్యాకేజిని ఈయూ ఇవ్వనుంది. యూరోజోన్ డిమాండ్ చేసిన సంస్కరణలను గ్రీస్ బుధవారంలోగా ఆమోదించాల్సిఉంటుంది. ప్యాకేజి అందుకుంటున్నందుకుగానూ, గ్రీస్ తన సార్వభౌమత్వాన్ని అప్పులిస్తున్న దేశాలు పర్యవేక్షించటానికి అంగీకరించాల్సిఉంటుంది. ఎట్టకేలకు గ్రీస్ యూరోజోన్‌నుంచి నిష్క్రమించాల్సిన అవసరం రాకుండా పోయిందని యూరోపియన్ కమిషన్ అధినేత జీన్ క్లాడ్ జంకర్ అన్నారు. గ్రీస్ ఇలాప్యాకేజ్ పొందటం మూడోసారి. అత్యంత కఠినమైన పోరాటంతర్వాత గ్రీస్‌కు ప్యాకేజి, అప్పుల పునర్వ్యవస్థీకరణ సౌలభ్యం లభించాయని ఆ దేశ ప్రధాని అలెక్సిస్ తిప్రాస్ అన్నారు. ఈ ఒప్పందంవలన గ్రీస్ మళ్ళీ గాడిలో పడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఒప్పందాన్ని అమలు చేయటం కష్టమైనప్పటికీ, గ్రీస్ మళ్ళీ అభివృద్ధిబాట పట్టటానికి అవకాశం ఇచ్చిందని అన్నారు.