తెలుగు360 రేటింగ్: 3/5
కథలో ఓ ట్విస్టు వస్తే… భలే అనిపిస్తోంది.
ట్విస్టు తరవాత ట్విస్టు..
ట్విస్టు తరవాత ట్విస్టు..
ట్విస్టు లకే ట్విస్టు ఇస్తూ పోతే…
అబ్బో.. భలే వుంటుంది. అసలు ద్రిల్లర్ల లక్షణమే అది.
ఎన్ని ట్విస్టు లుంటే అంత మజా.
ప్రేక్షకులకు ఓ కథ చెపుతూ… సరళంగా, సాధారణంగా సాగిపోతున్న ఆ కథకు వూహించని మలుపు తిప్పుతూ నడిపించడానికి నేర్పు కావాలి. ఆ మలుపులన్ని ఒకే గమ్యానికి చేర్పించి, చక్కని ముగింపు ఇవ్వడానికి దర్శకుడు ప్రతిభావంతుడు అయివుండాలి. దర్శకుడి ఆలోచనని ఆచరణలోకి పెట్టడానికి తగిన నటులు, సాంకేతిక నిపుణులు దొరకాలి. ఇవన్ని ఒకటికి ఒకటి, ఒకరుకి ఒకరు తోడైన సినిమా… ఎవరు..?
సమీర మహా (రెజీనా) రిసెప్షనిస్ట్ స్థాయి నుంచి ఎదిగిన అమ్మాయి. మహా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతని పెళ్లి చేసుకుంటుంది. ఉన్నట్టుండి వాళ్ల కంపెనీకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉన్న డీఎస్పీ అశోక్ (నవీన్‌చంద్ర)ని హత్య చేస్తుంది. తనని అత్యాచారం చేయడానికి పూనుకోవడంతోనే ఆ హత్య చేశానంటుంది. ఈ కేసుని పరిశోధించే బాధ్యతని అవినీతి పరుడైన పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్ (అడవి శేష్) తీసుకుంటాడు. సమీరని ఈ కేసు నుంచి కాపాడేందుకు డబ్బు కూడా తీసుకుని రంగంలోకి దిగుతాడు. కోర్టులో జరిగే వాదనలో ఎక్కడా దొరక్కూడదని ఈ కేసులోని అనుమానాలన్నింటినీ సమీర ముందు వెలిబుచ్చుతాడు. కోర్టుకి దొరక్కుండా తగిన సలహాలు ఇస్తానంటూనే అసలు నిజాలు రాబడతాడు. ఇంతలో తాను పరిశోధించిన మరో కేసు వినయ్ వర్మ (మురళీశర్మ) అదృశ్యం ఉదంతాన్ని కూడా ఆమె ముందుంచుతాడు. మరి అశోక్ హత్యకీ, వినయ్ వర్మ అదృశ్యానికీ సంబంధమేమైనా ఉందా? అసలు అశోక్‌ని సమీరనే చంపిందా లేక వేరొకరా? ఈ కేసులో హంతకులు ఎవరు? బాధితులు ఎవరనే విషయాలతో సినిమా సాగుతుంది.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఒక నేరం జరిగాక దాని వెనక పూర్వపరాల్ని వెదుకుతూ సాగుతుంటాయి. ఒకొక్క చిక్కుముడిని విప్పుకుంటూ వెళ్లాక చివరికి నిందితులతో పాటు, ఆ నేరం చేయడానికి గల అసలు కారణాలు బయటికొస్తాయి. అడవి శేష్ ఇదివరకు చేసిన `క్షణం` కూడా అలాంటి కథే. కానీ ఈ సినిమా అందుకు పూర్తి భిన్నం. నిందితులు, బాధితులు కళ్ల ముందే కనిపిస్తుంటారు. కానీ వాళ్లలో ఎవరు ఎవరన్నది మాత్రం అంతుచిక్కదు. ఆ చిక్కుముడి వీడితోనే అసలు కారణాలు బయటికొస్తాయి. ఆ చిక్కుముడిని విప్పే కథే ఈ చిత్రం. తొలి సన్నివేశంలోనే మర్డర్ జరుగుతుంది. దాంతో ప్రేక్షకుడు నేరుగా కథలోకి వెళతాడు. విక్రమ్ వాసుదేవ్ పాత్రలో అడవిశేష్ ప్రవేశించగానే కథ ఒక ఇన్వెస్టిగేషన్‌లా మారిపోతుంది. ఆ క్రమంలో రెజీనా వెల్లడించే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇంతలోనే మరో అనుమానాన్ని బయటపెట్టి ఈ సంఘటనలో మరో అంతుచిక్కని విషయమేదో దాగుందని కథని మలుపులు తిప్పుతుంటాడు కథానాయకుడు. అలా రెజీనా చెప్పే కథలు, వాటిలో అబద్ధం ఉందంటూ నిజాన్ని రాబట్టే తీరు, మధ్యలో తాను ఇన్వెస్టిగేషన్ చేసిన మరో కేసంటూ వినయ్ వర్మ కేసు వివరాల్ని సమీర ముందు వెల్లడించడం… ఇలా బోలెడన్ని మలుపులు కథలో చోటు చేసుకుంటాయి. అక్కడివరకు సమస్య లేదు కానీ… ద్వితీయార్థంలో మలుపుల మోతాదు మరింత పెరిగింది. అవి సామాన్య ప్రేక్షకుడు ఒక పట్టాన అర్థం చేసుకోలేని స్థాయి మలుపులు. దృష్టి ఏమాత్రం మళ్లినా కథ అర్థం కానంత ఇంటెలిజెంట్ మలుపులు. ఆ సందర్భంలో థ్రిల్ బదులు ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే పరిస్థితులే ఎక్కువ. పతాక సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇందులోని ప్రతి మలుపు వెనకా భావోద్వేగాలు పండేలా చూసుకున్నాడు దర్శకుడు. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే అంశమే. క్షణం, గూఢచారి చిత్రాల తర్వాత ప్రేక్షకుడు తన నుంచి మరింత థ్రిల్‌ని ఊహిస్తారనే అంచనాతో అడవి శేష్ ఈ సినిమాపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతుంది. చివర్లో వచ్చిన మలుపు ఆకట్టుకున్నా… లాజిక్‌తో ఆలోచిస్తే అప్పటివరకు కథానాయకుడు పాత్ర సాగిన విధానాన్నే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది.
కథ పరంగా కొత్తదనం కనిపిస్తుంది. తరచుగా వచ్చే థ్రిల్లర్ సినిమాలకి భిన్నంగా సాగుతుంది. కొత్త దర్శకుడైనా రామ్‌జీ ఈ కథపై ప్రదర్శించిన పట్టు మెచ్చుకోదగిన రీతిలో ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అబ్బూరి రవి మాటలు బాగున్నాయి. వంశీ కెమెరా పనితనం, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి. కథానాయకుడు అడవి శేష్ విక్రమ్ వాసుదేవ్ పాత్రలో మంచి వినోదాన్ని పంచాడు. ఆయన ఇన్వెస్టిగేషన్ సాగించే తీరు, అవినీతి అధికారిగా కనిపించిన వైనం ఆకట్టుకుంటుంది. రెజీనా పాత్ర, ఆమె అభినయం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. నటనకి ప్రాధాన్యమున్న పాత్రని ఆమె చక్కగా సద్వినియోగం చేసుకుంది. నవీన్ చంద్ర అభినయం కూడా ఆకట్టుకుంటుంది. మురళీశర్మ, పవిత్ర లోకేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది.
థ్రిల్లర్ సినిమాలు ఆషామాషీ కాదు. లాజిక్, చిక్కుముడుల్ని ఇంటెలిజెంట్‌గా డీల్ చేయాలి. ఒక్క చోట పట్టుతప్పినా కథంతా పట్టుతప్పిపోతుంది. రెండు హత్యలతో ముడిపడిన ఈ కథని ఆద్యంతం రక్తికట్టేలా చెప్పిన విధానం మెప్పిస్తుంది.
ఫినిషింగ్ టచ్: ట్విస్టుల ట్రీటు
తెలుగు360 రేటింగ్: 3/5