రైతు లేనిదే మనం లేము. రైతన్న స్వేదం చిందించనిదే మనకు నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్ళవు. క్షుద్బాధ తీరుస్తున్న పుడమి పుత్రుల రుణాన్ని మనం తీర్చుకుంనటున్నామా! పరికించి చూస్తే..విశ్లేషించుకుంటే ఫలితాలు నిరాశాజనకంగానే ఉంటున్నాయి. ఉంటాయి. ఉండబోతాయి కూడా. అధికారాలు రైతన్నల చుట్టూ తిరుగుతాయి. 1999-2004 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర ఆయన్ను రైతులకు దగ్గర చేసింది. ప్రజల కష్టాలు తెలుసుకునే థ్యేయంతో డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ప్రధానంగా రైతులనే కేంద్రంగా చేసుకుని సాగింది. రైతుల ఆత్మహత్యల సంఖ్య ఆ సమయంలో ఎక్కువగా ఉంది. రుణాలు చెల్లించద్దంటూ కాంగ్రెస్ అదే తరుణంలో రైతులకు పిలుపు కూడా ఇచ్చింది. ఫలితంగా రైతన్నలు కాంగ్రెస్ కావిడిని మోయాలని నిర్ణయించుకున్నారు. అదే కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూచోబెట్టింది. అనంతరం కాంగ్రెస్ రైతులకు ఏం చేసిందనే విషయాన్ని పక్కన బెడితే, 2013లో చంద్రబాబు ఇదే అంశాన్ని ఎంచుకుని వైయస్ పాదయాత్ర రికార్డును తిరగరాశారు. అంతకు ముందు బాబ్లీ ప్రాజెక్టు అంశంపై నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, మహారాష్ట్రలో లాఠీ దెబ్బలూ తిన్నారు. 2014 ఎన్నికల్లో ఫలితం చంద్రబాబుకు అనుకూలంగా వచ్చింది. పాదయాత్రలో ఆయనిచ్చిన ప్రధాన హామీ రైతుల రుణామాఫీ. ఆ హామీని నెరవేర్చామని ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంపై రైతులలో అసంతృప్తి అలాగే ఉంది. రైతుల రుణాలను మాఫీ చేస్తామనీ, ఇక్కట్లను తీరుస్తామనీ చెబుతూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధాని కోసమంటూ ఏకంగా 33 వేల ఎకరాల సస్యశ్యామలమైన మాగాణిని పాడుబెట్టేసింది. ఇవన్నీ రైతులనుంచి బలవంతంగానో.. ప్రలోభాలు చూపో సేకరించినవే. రాబోయే రాజధాని తమ భూముల్లో వస్తుందనే భావనతో ఇచ్చిన వారూ ఉన్నారు. రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చారని చంద్రబాబు తరచూ కృతజ్ఞతలు చెబుతున్నది వీరికే. ఏతావాతా చూస్తే.. రైతులకు ఎంత మేలు చేకూరిందీ.. ప్రభుత్వాలు ఏ మేరకు ఆదుకున్నాయనేది విశ్లేషించుకుంటే దాదాపుగా లేదనే సమాధానమే వస్తుంది. తమ వద్ద ఉన్న పొలాలను కుదువబెట్టుకుని రైతు తన కష్టమేదో తానే పడ్డాడు తప్ప, ఎవరినీ చేయిచాచి అర్థించలేదు. కష్టాలు పీకమీదకి వచ్చిన సందర్భంలో ఆత్మహత్యకు ఒడిగట్టాడు తప్ప.. తన కష్టమిదని నిజమైన రైతెవరూ ప్రభుత్వ పెద్దల శరణుజొచ్చలేదు.
ప్రభుత్వాలు రైతులకు తప్ప మిగిలిన అన్ని రంగాలనూ ఏదో రకంగా సాయంచేస్తూనే ఉన్నాయి. లక్షలాది మంది ఉద్యోగులకు నెల జీతాలనీ, అలవెన్సులనీ, విహార యాత్రలకనీ, ఇతరత్రా సౌకర్యాలకనీ లక్షలకు లక్షలు అడక్కుండానే ఇస్తుంటాయి. అన్నం పెట్టే రైతు దేబిరించినా పట్టించుకోరు. బోనస్‌గా ఏటా ఎరువుల ధరలు, విత్తనాల ధరలూ పెంచేస్తారు. గిట్టుబాటు ధర ప్రకటన కూడా సక్రమంగా ఉండదు. దళారీలు దోచుకుంటుంటే వత్తాసు పలికేవారు తప్ప అదేమిటని అడిగేవారుండరు. కిలో పదిరూపాయలు కూడా రైతుకు కిట్టదు. మార్కెట్లో మాత్రం 50 రూపాయలకు తక్కువగా కిలో బియ్యం దొరకదు. ఈ వ్యత్యాసం ఎక్కడికి పోతోంది. ప్రభుత్వ పెద్దలు లేదా బేహారుల జేబుల్లోకే పోతుంది. ఎన్నికల ఖర్చు కోసం అన్ని వర్గాల నుంచి వసూలు చేస్తున్నట్లే రైతు నుంచి ఈ రకంగా బలవంతంగా వసూలు చేస్తున్నారనిపిస్తోంది. రైతుకు కనీస రవాణా సౌకర్యాలూ ఉండవు. ఏ పంట పండించే రైతుకైనా ఇదే దుస్థితి. ఈ ప్రభుత్వాలు నిజంగా రైతుల గురించి ఆలోచిస్తుంటే.. రైతులపై ప్రేమాభిమానాలుంటే… ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే వారికీ నెలకింతని వేతనాలు చెల్లించాలి. కనీసం నెలకు 25వేల రూపాయలను ఓ రైతు కుటుంబానికి చెల్లిస్తే వారికి భరోసా కనిపిస్తుంది. పనిపై ఆసక్తి పెరుగుతుంది. అన్నం పెట్టే రైతన్న రుణం తీర్చుకోవడానికి ఇంతకు మించి మార్గం లేదు. దీనితో పాటు దళారుల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఎరువులనూ, విత్తనాలనూ రైతులకు అరువుగా ఇవ్వాలి. మార్కెట్ యార్డుకు రైతును రమ్మనడం కాకుండా వారివద్దకే అధికారులు వెళ్ళి పంటను కొనుగోలు చేయాలి.
ఒక్క సారి చేసి చూడండి. రైతు ఎంత ఆనందిస్తాడో.. రైతు ఆనందం ఈ పుడమికి కొత్త కళను తెస్తుంది. బలవన్మరణాలనుంచి వారిని కాపాడిన వారవుతారు. ప్రభుత్వోద్యోగుల్లాగా వారు ఇంక్రిమెంట్లడగరు. పేస్కేలు కోరరు. ఇలా చేసే ధైర్యం ఏ ప్రభుత్వానికైనా ఉందా? ఉందని తెలంగాణ ప్రభుత్వం నిరూపించే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ప్రతి రైతు ఖాతాలో 4వేల రూపాయలు జమచేస్తామన్న కేసీఆర్ ప్రకటన దీనికి పునాది కావాలి. ప్రతి రాష్ట్రమూ ఈ దిశగా ఆలోచించాలి. రైతు భవితను బాగుచేయాలి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి