ఎన్టీఆర్ బయోపిక్‌లో రోజురోజుకో ప్రత్యేకత చేరుతూ వస్తోంది. పాత్రలు, దానితో పాటు సినిమా పరిధి కూడా పెరుగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఎన్టీఆర్, చంద్రబాబు, లక్ష్మీపార్వతి లాంటి ప్రధానమైన పాత్రలే గుర్తొస్తాయి. అయితే.. ఈ కథలో చాలా కోణాలున్నాయి. చాలా పాత్రలు ఉన్నాయి. వాటిలో కేసీఆర్ కూడా ఒకటని, ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన పాత్ర కూడా కనిపిస్తుందని తెలుస్తుంది. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సీఎం, ఓ పార్టీకి అధ్యక్షుడు. కానీ ఆయన ఎన్టీఆర్ వీరాభిమాని. 1982లో టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు…. మొట్టమొదట ఆ పార్టీలో అడుగుపెట్టినవాళ్లలో కేసీఆర్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా.. ఆయన అన్నకు చేదోడు వాదోడుగా నిలిచారు. తన తనయుడికి `రామారావు` అనే పేరు కలిసొచ్చేలా కేటీఆర్ అని నామకరణం చేశారు. అంతటి అభిమానిని ఈ కథలో చూపించకుండా ఎలా ఉంటారు. అందుకే క్రిష్ ఈ పాత్రనీ కథలో జోడించార్ట. ఇందులో మరో స్వార్థం కూడా ఉంది. కేటీఆర్ ఈ సినిమాలో ఉన్నారంటే… తెలంగాణలో `ఎన్టీఆర్` సినిమా మైలేజీ ఇంకాస్త పెరుగుతుంది. దాంతో.. కేటీఆర్‌ని ఈ కథలోకి తీసుకురాక తప్పలేదు. మరి ఆ పాత్ర ఎవరు పోషిస్తారు? నిడివి ఎంత సేపు ఉంటుంది? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.