జనసేన అధినేత . డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే చాలా మంది స్పందించారు. ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి కేంద్రం తరపున ఎలాంటి సాయం అయినా రెడీగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు, లోకష్ కూడా స్పందించారు. అయితే పవన్ తో అనుబంధం ఉన్న వారందరూ స్పందించారు. వారితో పాటు పవన్ ను రాజకీయంగా వ్యతిరేకించే వారు కూడా పవన్ కుమారుడు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెట్టారు.
ఈ పోస్టుల్లో అందరి దృష్టిని ఆకర్షించినవి జగన్ రెడ్డి, రోజా పెట్టిన పోస్టులే. జగన్ రెడ్డి మనస్థత్వం గురించి బాగా తెలిసిన వారు ఆయన ఇలా పోస్టు పెట్టారని చాలా వరకూ నమ్మలేకపోయారు. భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు కానీ.. అరకులో కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను నక్సలైట్లు హత్య చేసినప్పుడు కానీ ఆయన కనీస మానవత్వం చూపించలేదన్న విమర్శలను ఎదుర్కొన్నారు. తనకు ప్రత్యర్థులైన వారికి కష్టం వస్తే ఆయన సంతోషపడతారని చెప్పుకుంటారు. అందుకే పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిస్తే స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. మార్పు మంచిదే ..అన్నట్లుగా జగన్ ట్వీట్ పెట్టారు. పవన్ కల్యాణ్ కూడా ధ్యాంక్స్ చెప్పారు.
ఇక పెద్ద నోరున్న రోజా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ట్వీట్ పెట్టారు. అలాగే కొంత మంది వైసీపీ నేతలు కూడా స్పందించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే జనసేన పార్టీ వ్యతిరేకులు కూడా మంచి మనసుతో స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకుండా.. ఇలాంటి సుహృద్భావ వాతావరణం ఉంటే.. చెడిపోయిన రాజకీయాలు కాస్త అయినా బాగుపడతాయి.
అయితే సోషల్ మీడియాలో ఉండే కొంత మంది సైకోలు మాత్రం మారలేదు. వారికి కనీస మానవత్వం కూడా ఉండదు. పవన్ కల్యాణ్ వల్ల పరీక్షకు కొంత మంది వెళ్లలేకపోయారని.. ఆ పాపం తగిలిందని కొంత మంది పోస్టులు పెట్టారు. అసలు వారు ఆలస్యం అయింది పవన్ కల్యాణ్ వల్లే అన్నది తప్పుడు ప్రచారం. సీసీ కెమెరాలు కూడా అవే చెబుతున్నాయి. అయినా ఈ సైకోలు మారరు. ఎవరూ మార్చలేరు. కానీ.. నేతల్లో మాత్రం కొంత మార్పును చూశామని సంతృప్తి పడవచ్చు.