తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ పోరాటం రాహుల్ గాంధీ కూడా ఆపలేరని తేలిపోయింది. వచ్చే నెలలో రాహల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అత్యంత భారీగా జన సమీకరణ చేసి పట్టు చూపించాలని … కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జన సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగొండలోనూ కార్యకర్తలతో సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే ఈ సమీక్ష అవసరం లేదని కోమటిరెడ్డి అంటున్నారు.
పీసీసీ చీఫ్ పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇటీవల స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చారు. ఈ కారణంగా తాను రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు పీసీసీ చీఫ్ మాత్రం తన జిల్లాలో పర్యటించవద్దని ఆయన నేరుగానే చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పార్టీ బలహీనంగా ఉందని అక్కడ పర్యటించాలని అంటున్నారు. కోమటిరెడ్డి కి వ్యతిరేకంగా ఉండే నల్లగొండ నేతలు రేవంత్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్‌కు ఎక్కడైనా పర్యటించే అధికారంఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. మరో వైపు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ బలహీనంగా ఉన్నజిల్లాల్లో పర్యటించాలని కోమటిరెడ్డి సూచించారని అంటున్నారు.తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా పైకి మాత్రమే కలసిపోయినట్లుగా కనిపిస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు బయటపడుతున్నారు. ఇలా ఉంటే.. కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని క్యాడర్ నిరాశకు గురవుతున్నారు.