ఎన్టీఆర్ రాజకీయంగా ఎదిగే దశలో… అండ దండగా ఉన్నది మీడియా గురు… రామోజీ రావు. ఓ రకంగా.. ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ఇతోదికంగా ‘ఈనాడు’ సహాయం చేసింది. అప్పటి నుంచీ టీడీపీకీ, ఈనాడుకీ అవినాభావ సంబంధం మొదలైంది. అది ఎన్టీఆర్ ఉన్నన్నినాళ్లూ కొనసాగింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెలలోనే షూటింగ్‌కి వెళ్లబోతోంది. ఎన్టీఆర్ బయోపిక్ మొదలయ్యే లోగా.. రామోజీరావుని సంప్రదించి, ఆయన సలహాలూ సూచనలు తీసుకోవాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. ఈవారమే అందుకు ముహూర్తం కూడా కుదిరినట్టు సమాచారం. బాలయ్య ప్రస్తుతం అమరావతిలో ఉన్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక… రామోజీరావుని సంప్రదిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించి రామోజీ దగ్గర కొన్ని సలహాలూ, సూచనలు తీసుకోవాలన్నది బాలయ్య ప్రధాన ఉద్దేశం. అంతేకాదు.. ఈసినిమాలో రామోజీరావుకి సంబంధించిన ఓ పాత్ర కూడా ఉంది. రామోజీని నేరుగా చూపించకపోయినా.. ఆయన ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది బాలయ్య ప్రధాన లక్ష్యం. తేజ కూడా అందుకు సమర్థుడే. సినిమాని చక చక లాగించేయగలడు. సో.. ఈసారీ బాలయ్యని సంక్రాంతి బరిలో చూసేయొచ్చు.