సీఎం జగన్ స్టైల్ వేరు. ఆయన సమస్యలను డీల్ చేసే విధానం వేరు. ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి దాన్ని కూడా పథకంగా ప్రవేశ పెట్టగలిగే నేర్పరితనం ఆయన సొంతం. ఎవరితో ఎలా రాజకీయాలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఉద్యోగుల విషయంలోనూ అదే నిజమైంది. ఉద్యోగులంటనే పనులు చేయకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూ ప్రభుత్వాన్ని చికాకు పెడుతూంటారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు వారికి అలాంటి చాన్స్ ఇవ్వలేదు. పైగా జీతం తగ్గించేసి… చప్పట్లు కూడా కొట్టించేసుకున్నారు సీఎం జగన్.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల జీతం తగ్గబోతోంది. రూ. 80వేల వరకూ అన్ని రకాల అలవెన్స్లతో జీతం పొందుతున్న వారికి వచ్చే నెల నుంచి రూ. రెండు నుంచి మూడు వేల వరకూ జీతం కోత పడబోతోంది. ఇంకా తక్కువ జీతం ఉన్న వారికి రూ. రెండు వేల వరకూ జీతం తగ్గబోతోంది. ఈ విషయం పీఆర్సీ ప్రకటించిన వెంటనే అందరికీ అర్థం అయిపోయింది. అయితే సీఎం జగన్ పెండింగ్‌లో ఉన్న డీఏలు అన్నింటినీ జనవరితో కలిపి ఇస్తామని ప్రకటించారు. అవి పది డీఏలుగా ఉన్నాయి. వాటన్నింటినీ ఇస్తే.. కోతపడే జీతం కవర్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు.. ఒకటి.. రెండు వేలు కూడా పెరుగుతాయి. దీంతో జీతం పెరిగిందన్న సంతృప్తి ఉద్యోగులకు ఉంటుంది.
డీఏలు టైమ్లీగా ఇవ్వకుండా ఆపేసి.. ఇప్పుడు జీతంలో కోత పెట్టి.. ఆ కోతను సర్దుబాటు చేయడానికి ఈ డీఏలను వాడుకున్నారని ఉద్యోగు సంఘాల నేతలందరికీ తెలుసు. కానీ ఎవరూ నోరెత్తలేదు. పైగా సీఎం ఆ ప్రకటన చేయగానే చప్పట్లుకొట్టారు. బయటకు వచ్చి.. సంతృప్తి ప్రకటించారు. అంతేనా.. తమ పోరాటం వల్లే ఈ మాత్రం పీఆర్సీ వచ్చిందన్నారు. వీరికి ఆ మాత్రం భయభక్తులు ప్రభుత్వాలపై ఉండాల్సిందేనని.. లేకపోతే నెత్తికెక్కుతారని సామాన్య ప్రజల అభిప్రాయం. ఈ విషయంలో సీఎం జగన్ కరెక్ట్‌గానే వ్యవహారించారు. వారిని ఎలా కంట్రోల్లో ఉంచాలో అలా ఉంచారు. జీతం తగ్గించినా నోరెత్తకుండా చప్పట్లు కొట్టించుకున్నారు.