ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ ట్రెండ్స్‌ని అబ్జర్వ్ చేస్తే మాత్రం భజనరాయుళ్ళనే పార్టీల అధినేతలు చేరదీస్తున్న విషయం అర్థమవుతుంది. ప్రజలకు ఎంత సేవ చేశారు? నీతి, నిజాయితీలు ఉన్న నాయకుడేనా అనే లాంటి విషయాల కంటే కూడా పార్టీ అధినేతలకు ఏ స్థాయిలో భజన చేయగలడు అనే విషయాన్ని ప్రాతిపదికగా చేసుకునే పార్టీల అధినేతలు నాయకులను అందలం ఎక్కిస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి భజన బ్యాచ్ ఉన్నారు కానీ….అలాంటి వాళ్ళందరిలోకి ఫస్ట్ ర్యాంక్ మాత్రం వెంకయ్యనాయుడికే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ గొప్పతనాన్ని పరిచయం చేసింది కూడా వెంకయ్యనాయుడు భజనే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ ఇచ్చిన హామీలు తక్కువే కానీ….మోడీ తరపున వకాల్తా పుచ్చుకున్న వెంకయ్యనాయుడు మాత్రం మోడీ తరపున అనేక హామీలిచ్చేశారు. దాదాపు రెండున్నరేళ్ళ పదవీకాలం తర్వాత ఆ హామీలలో కనీసం సగం అయినా నెరవేరాయా అంటే మాత్రం వెంకయ్యనాయుడు కూడా సమాధానం చెప్పడు. మాకంటే కాంగ్రెస్సే ఎక్కువ పాపాలు చేసింది అంటాడు. కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టే హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కమలాన్ని దగ్గరకు తీసుకున్నారన్న విషయాన్ని మాత్రం కన్వీనియెంట్గా మర్చిపోతూ ఉంటాడు వెంకయ్య. ఆ విషయం పక్కన పెడితే….ఆర్థిక లోటు భర్తీ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లాంటి ప్రధాన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని మోడీపైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అసంతృప్తి సెగలు రేగే టైంకి వెంకయ్యనాయుడు సీన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. మోడీ దేవధూత…అట్టే మాట్టాడితే దేవుడు కూడా..దేవుడిని ప్రశ్నించకూడదు అని చెప్పి మీడియావాళ్ళకు కూడా క్లాసులు పీకుతాడు. తనకు వచ్చిన ప్రాసల ప్రావీణ్యం మొత్తం ప్రదర్శిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడి సమర్థత, చంద్రబాబు సాధిస్తున్న అభివృద్ధి గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఉంటే….ఎప్పుడూ సీరియస్‌గా ఉండే చంద్రబాబు కూడా మురిసిపోతూ ఉంటాడు. అదీ వెంకయ్య భజన స్థాయి.
వెంకయ్య నాయుడి భజన కేవలం రాజకీయాల వరకే పరిమితమవుతుందనుకుంటే పొరపాటు. అన్ని విషయాలపైనా వెంకయ్య స్టైల్ అలానే ఉంటుంది. రీసెంట్గా ఓ తెలుగు భక్తి సినిమాను ప్రమోట్ చేయడానికి వెంకయ్యను ఆహ్వానించారు ఆ సినిమా నిర్మాతలు. అందుకోసమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సినిమాను పొగిడే విషయంలో కూడా తన ప్రావీణ్యత మొత్తం చూపించేశాడు వెంకయ్య. తెలుగు సినిమా, అందులోనూ ఒక మతానికి చెందిన భక్తి సినిమాను ప్రతి భారతీయుడు చూడాలని చెప్పి తీర్పిచ్చేశాడు. తెలుగులో తప్ప వేరే ఏ భాషల్లోనూ కనీసం డబ్బింగ్‌కి కూడా నోచుకోని ఓ ప్రాంతీయ సినిమాను భారతీయులందరూ ఎలా చూస్తారో వెంకయ్యనాయుడే చెప్పాలి. అలాగే ఎంత ఆరెస్సెస్ బిడ్డ అయితే మాత్రం ఒక మత సిద్ధాంతాలను ప్రాతిపదికగా తీసుకుని తెరకెక్కించిన సినిమాను భారతీయులందరూ చూడాలని చెప్పి కేంద్రమంత్రి స్థానంలో ఉన్న ఒక నాయకుడు చెప్పొచ్చా? విశాల దృక్పథంతో ఆలోచించాలి అని చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో కానీ…..లౌకిక రాజ్యాన్ని కాపాడతానని చెప్పి హామీలిచ్చే నాయకులు, ప్రమాణాలు చేసే నాయకులు సంయమనం కోల్పోతే ఎలా? భజన ప్రోగ్రాంకి పిలిచారు కాబట్టి….ఆ పిలిచిన వాళ్ళు కూడా హాశ్ఛర్యపోయేలా భజన చేయాలనుకోవడం సముచితమే కావొచ్చు కానీ కేంద్రమంత్రినన్న విషయం మర్చిపోయి మాట్లాడేయడం మాత్రం సీనియర్ మోస్ట్ నాయకులకు భావ్యం కాదేమో.