మొత్తానికి ఎన్నికల రోజు రానే వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో లక్షలాదిమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎందుకనో కొంతమంది మాత్రం, ఎన్నికల సమయంలో నాలుగడుగులు వేసి ఓటు వేయడానికి బద్దకిస్తుంటారు. నా ఒక్కడి ఓటు వల్ల ఏం జరుగుతుందిలే అన్న అభిప్రాయం కూడా ఇందుకు ఒక కారణం. అయితే ఒక్క ఓటుతో ఫలితాలు మారిపోయిన ఘటనలు భారతదేశ ఎన్నికల చరిత్రలో చాలానే కనిపిస్తాయి.
ఉదాహరణకి, 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువ నారాయణకు వచ్చిన ఓట్ల సంఖ్య 40, 752. రెండవ స్థానంలో నిలిచిన అభ్యర్థి జనతా దళ్ పార్టీకి చెందిన కృష్ణమూర్తి. ఇతనికి వచ్చిన ఓట్ల సంఖ్య 40, 751. అంటే కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడన్న మాట. అలాగే వైఎస్సార్సీపీ తరఫున 2014లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మెజార్టీ కేవలం 12 ఓట్లు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన స్థానాలు 18 అయితే, పదివేల లోపు ఓట్ల మార్జిన్ తో ఓడిపోయిన స్థానాలు 26. వీటిలో 3000 లోపు ఓట్లతో ఓడిపోయిన స్థానాలలో ప్రజారాజ్యం గెలిచినా కూడా 2009లో రాజకీయ పరిస్థితి మరొక రకంగా ఉండేది.
కాబట్టి ఒక్క ఓటుతో ఏం మారిపోతుందిలే అనుకునేవాళ్ళు, నేను ఒక్కడు ఓటు వేయక పోయినంతమాత్రాన ఏమవుతుందిలే అనుకునేవాళ్ళు, పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎన్నో కీలక నిర్ణయాలు ఒక్క ఓటు తేడాతో మారిన సంఘటనలు ఉన్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని పునరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఉంది.