వివేకా హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ తర్వాత మెల్లగా అయినా విచారణ నిందితుల వద్దకు చేరుతున్న సమయంలో కొత్త కొత్త క్యారెక్టర్లకు బయటకు వస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా అంతా ఇద్దరు, ముగ్గురు వైఎస్ వివేకా అల్లుడే చేయించాడని.. వివేకా స్త్రీ లోలుడని ప్రచారం చేయడానికి వెనుకాడని వ్యక్తులు తాజాగా సీబీఐ మీద గురిపెట్టారు. కల్లూరు గంగాధర్ రెడ్డి అనే యువకుడు కొత్తగా అనంతపురం ఎస్పీని కలిసి నేరుగా సీబీఐ అధికారుల మీద ఫిర్యాదు చేశారు.
వైఎస్ అవినాష్ రెడ్డికి.. ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా సాక్ష్యాం చెప్పాలంటూ సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. తనకు సీబీఐ అధికారులు రూ. పది కోట్లు ఆఫర్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అంతే కాదు తానే చంపానని ఒప్పుకోవాలని కూడా ఒత్తిడి చేశారని అంటున్నారు. ఓ సమగ్రమైన లేఖను తీసుకుని ఆయన ఎస్పీని కలిశారు. తర్వాత ఓ వర్గం మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. గంగాధర్ రెడ్డి చెబుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
కడప ఎస్పీని కాకుండా అనంతపురం ఎస్పీని కల్లూరు గగాంగధర్ రెడ్డి కలవడం.. అంతా ఓ ప్లాన్ ప్రకారం చెబుతున్నట్లుగా మీడియాకు చెబుతూండటం ఆసక్తి రేపుతోంది. సీబీఐ అధికారులపై ఆరోపణలు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని కొంతమంది అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కల్లూరు గంగాధర్ రెడ్డి ఎవరు.. ఏమిటి అన్నదానిపై వివరాలు బయటకు రావాల్సి ఉంది.